కెమికల్ పరిశ్రమల నిర్మాణాలను వ్యతిరేకిద్దాం..

బిక్కనూర్, ఆంధ్రప్రభ : మండల పరిధిలో జరిగే కెమికల్ పరిశ్రమల నిర్మాణాలను పూర్తిగా వ్యతిరేకించాలని పలు గ్రామాల సర్పంచులు నిర్ణయించారు. ఈ మేరకు మంగళవారం మండలంలోని పెద్ద మల్లారెడ్డి గ్రామంలో చుట్టుపక్కల గ్రామాల సర్పంచ్లు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్లతోపాటు ఆయా గ్రామాల ప్రజలు మాట్లాడుతూ భావితరాలను దృష్టిలో పెట్టుకొని కెమికల్ పరిశ్రమల నిర్మాణాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు ఇవ్వవద్దని కోరారు. ప్రస్తుతం ఉన్న పరిశ్రమ వల్ల ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నూతనంగా ఏర్పాటు చేసే ఫ్యూజన్ కంపెనీకి అనుమతులు నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

పార్టీలకు అతీతంగా మండల పరిధిలోగల 18 గ్రామాల ప్రజలు ఉద్యమించవలసిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు. అన్ని గ్రామపంచాయతీలలో పరిశ్రమలకు వ్యతిరేకంగా తీర్మానాలు చేసి ప్రజావాణిలో కలెక్టర్కు వినతి పత్రాలు అందించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. కార్యక్రమంలో పెద్ద మల్లారెడ్డి సర్పంచ్ కోడూరి సాయ గౌడ్, అయ్యవారిపల్లి సర్పంచ్ జాల సత్యం, మల్లుపల్లి సర్పంచ్ నరసింహులు, కాచాపూర్ సర్పంచ్ పాలమాకుల జ్యోతి, కంచర్ల సర్పంచ్ గొల్ల అరుణ, పెద్ద మల్లారెడ్డి చైతన్య కొండల్ రెడ్డి , మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ హనుమంత రెడ్డి, వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు పలు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply