11th Division | మస్జిద్-ఏ-కౌసర్, హ్యూమన్ వెల్ఫేర్ సెంటర్ ప్రారంభం..

11th Division | మస్జిద్-ఏ-కౌసర్, హ్యూమన్ వెల్ఫేర్ సెంటర్ ప్రారంభం..
11th Division | విజయవాడ, ఆంధ్రప్రభ : నగరంలోని తూర్పు నియోజకవర్గ పరిధి 11వ డివిజన్ ఏపీసీసీ కాలనీలో నిర్మించిన మస్జిద్-ఏ-కౌసర్, హ్యూమన్ వెల్ఫేర్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్ హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ముస్లిం మైనారిటీల సంక్షేమానికి నిజంగా అండగా నిలిచిన ఏకైక నాయకుడు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి మాత్రమేనని స్పష్టం చేశారు.
“పైన అల్లా, కింద జగన్ – ఇదే ఈ మసీదు నిర్మాణానికి కారణం” అంటూ వ్యాఖ్యానించారు. గతంలో ఈ ప్రాంతంలో ఉన్న పాత మసీదు అభివృద్ధికి అనేక అడ్డంకులు ఎదురైనా, స్వర్గీయ దేవినేని నెహ్రు ముస్లిం సోదరులకు అండగా నిలిచి మసీదు అభివృద్ధికి విశేషంగా కృషి చేశారని గుర్తు చేశారు. 2019 నవంబర్ నుంచి తాను ఇన్చార్జ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎమ్మెల్సీ రుహుల్లాతో కలిసి అనేకసార్లు మున్సిపల్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారులతో చర్చించి మసీదు స్థల సమస్యను పరిష్కరించామని తెలిపారు.

గత టీడీపీ ప్రభుత్వ కాలంలో డంపింగ్ యార్డ్ పక్కన స్థలం చూపించారని, కానీ మైనారిటీ పెద్దలు ప్రస్తుత స్థలానికే ప్రాధాన్యం ఇవ్వాలని కోరడంతో ఈ విషయాన్ని నేరుగా జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. వెంటనే సీఎం జగన్ స్పందించి మైనారిటీలకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించాలని ఆదేశాలు ఇచ్చారని అవినాష్ వెల్లడించారు. ముస్లిం సోదరులు మూడు వందల గజాలు సరిపోవని కోరడంతో, పూర్తి స్థలాన్ని మంజూరు చేయాలని మున్సిపల్ కమిషనర్‌కు లేఖ రాసి నిర్మాణానికి అనుమతులు ఇప్పించామని తెలిపారు.

మస్జిద్-ఏ-కౌసర్ & ఇస్లామిక్ సెంటర్ నిర్మాణంలో ఎదురైన అన్ని అడ్డంకులను అధిగమిస్తూ అధికారులతో సమన్వయం చేసి పనులు పూర్తి చేశామని చెప్పారు. మైనారిటీల సంక్షేమానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎల్లప్పుడూ తోడుగా ఉందని, షాదీ ఖానాలు, ఉర్దూ పాఠశాలలు వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలకు సీఎం జగన్ నిరంతరం సహకరిస్తున్నారని ప్రశంసించారు.
రానున్న రోజుల్లో కూడా మైనారిటీల అభివృద్ధికి శ్రమిస్తున్న సీఎం జగన్‌కు ముస్లిం సోదరులు అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎండి రుహుల్లా, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, పార్లమెంట్ కార్యదర్శి, ఉమ్మడి కృష్ణా జిల్లా వక్ఫ్ బోర్డు ఛైర్మన్ మీర్ హుస్సేన్, మైనారిటీ నాయకులు ఎండి రిజ్వాన్, సయ్యద్ అలీమ్, నాహీద్, మోహిద్దున్, ఖలీమ్, సుభాని, జావీద్ తదితరులు పాల్గొన్నారు.
