BC Legend No More : అజాత శత్రవు ఐలాపురం వెంకయ్య ఇకలేరు

BC Legend No More : అజాత శత్రవు ఐలాపురం వెంకయ్య ఇకలేరు
సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి
ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో
ప్రముఖ బీసీ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ ఇలాపురం వెంకయ్య (96) మహాశివరాత్రి పర్వదినాన కన్నుమూశారు. ఆయన మరణ వార్త బడుగు జీవుల్లో కన్నీరు పెట్టించింది. అజాత శత్రవుగా రాజకీయ వర్గాల మదిలో స్థిర స్థానం పొందిన ఆయన మరణం తీవ్ర విషాదాన్ని కలిగించింది. విజయవాడలోని ఆయన స్వగృహంలో ఉదయం 11.00 గంటలకు తుది శ్వాస విడిచారు. ప్రజల సమస్యల పరిష్కారంలో, బీసీ వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయి. ఆయన పెద్ద కుమారుడు, మాజీ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఇలాపురం రాజా సహా ముగ్గురు సంతానం. ఐలాపురం వెంకయ్య మరణ వార్తతో ఏపీ, తెలంగాణలోని శాలివాహన కుటుంబాలు శోక సంధ్రంలో మునిగిపోయాయి.
సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి
ప్రముఖ బీసీ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య మృతి పట్ల సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. బీసీ వర్గాల అభ్యున్నతి, హక్కుల సాధన కోసం వెంకయ్య నిరంతరం పనిచేశారని ముఖ్యమంత్రి అన్నారు. నిరాడంబర జీవితాన్ని గడుపుతూ, అందరితో సత్సంబంధాలు కలిగిన వెంకయ్య మృతికి చంద్రబాబు సంతాపం తెలిపారు. వెంకయ్య కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఐలాపురం వెంకయ్య ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని సీఎం చంద్రబాబు చెప్పారు.
