255points | బ్యాంకింగ్ షేర్ల అమ్మకాలతో సూచీలపై ఒత్తిడి

255points | బ్యాంకింగ్ షేర్ల అమ్మకాలతో సూచీలపై ఒత్తిడి

255points | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిణామాలు, గ్లోబల్ మార్కెట్ల మిశ్రమ సంకేతాల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. డాలర్‌తో పోల్చితే రూపాయి విలువ కాస్త బలహీనపడటం, బ్యాంకింగ్ రంగంలో అమ్మకాల ఒత్తిడి పెరగడం వల్ల ప్రధాన సూచీలు స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్నాయి.

గత ట్రేడింగ్ సెషన్ ముగింపు స్థాయి 76,009తో పోలిస్తే సెన్సెక్స్ ఇవాళ ఫ్లాట్‌గా ప్రారంభమైంది. అయితే అనంతరం మార్కెట్లో తీవ్ర ఒడిదుడుకులు కనిపించాయి. ఉదయం 10 గంటల సమయానికి సెన్సెక్స్‌ 144 పాయింట్లు కోల్పోయి 75,864 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు నిఫ్టీ కూడా 36 పాయింట్ల నష్టంతో 23,876 వద్ద కొనసాగుతోంది.

డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రూ.95.74 వద్ద బలహీనంగా ట్రేడవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, విదేశీ పెట్టుబడిదారుల అప్రమత్త ధోరణి మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నట్లు విశ్లేషకులు అంటున్నారు.

సెన్సెక్స్‌, నిఫ్టీలో సీజీ పవర్, స్విగ్గీ, హిందాల్కో, వెర్నోవా టీడీ, ట్యూబ్ ఇన్వెస్ట్‌మెంట్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. మరోవైపు కోల్ ఇండియా, ఓఎన్‌జీసీ, ఐటీసీ, ఎల్‌ఐసీ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

బ్యాంకింగ్ రంగంలో అమ్మకాల ఒత్తిడి కారణంగా బ్యాంక్ నిఫ్టీ 206 పాయింట్ల నష్టంతో కొనసాగుతోంది. అయితే మిడ్‌క్యాప్ షేర్లలో కొనుగోళ్లు కొనసాగుతుండటంతో నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్‌ 255 పాయింట్ల లాభంతో కదలాడుతోంది. మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. అంతర్జాతీయ పరిణామాలు, క్రూడ్ ఆయిల్ ధరల మార్పులు, డాలర్ బలపడటం వంటి అంశాలు రాబోయే రోజుల్లో కూడా మార్కెట్ ధోరణిని ప్రభావితం చేసే అవకాశముంది.

Leave a Reply