శిధిలావస్థలో ఎఫ్.డీ.వో కార్యాలయం

శిధిలావస్థలో ఎఫ్.డీ.వో కార్యాలయం
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లాలో నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఐదు రేంజ్ లతో పెద్ద ఐఎఫ్ఎస్ అటవీ డివిజన్ గా పేరుగాంచిన బెల్లంపల్లి డివిజన్ నేడు రెండు రేంజ్ లకే పరిమితమైంది. గత 10 సంవత్సరాలుగా బెల్లంపల్లి డివిజన్ పై అటవిశాఖ ఉన్నతాధికారులు పట్టీ పట్టనట్లుగా వ్యవహారిస్తూ చిన్న చూపు చూస్తున్నట్లు ప్రజలు పేర్కొంటున్నారు. 1998 ఏప్రిల్ 2న బెల్లంపల్లి రైల్వే స్టేషన్ సమీపాన గల నూతన భవనాన్ని నాటి ఆదిలాబాద్ ఫారెస్ట్ కన్జర్వేటర్ మధుసూదన్ రావు ప్రారంభించారు. పట్టణంలోని కెమికల్ ఏరియా అటవీశాఖ కాంప్లెక్స్ లో ఉన్న డిఎఫ్ఓ కార్యాలయాన్ని నాడు నూతన భవనంలోకి తరలించిన విషయం విధితమే.

1998లో నిర్మించిన నాటి భవనం మెయింటెనెన్స్ లోపం నాణ్యత లోపం కారణంగా 28 సంవత్సరాలకే శిథిలావస్థకు చేరుకుంది. కొంతకాలంగా భవనంలో చాలా భాగం పెచ్చులు ఊడిపోవడంతో పాటు భవనం నిర్మించేందుకు కట్టిన భీములపెచ్చులు ఊడిపోయి దయనీయ స్థితిలో భవనం దర్శనమిస్తోంది. ప్రధాన రహదారిని అనుకుని ఉన్న ఈ భవనం ఆలనా పాలన లేక ఎప్పుడు కూలిపోతుందో తెలియని దుర్భర పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతోంది. దీంతో కార్యాలయంలో పని చేస్తున్న సిబ్బంది భయం భయంగా విధులు నిర్వహిస్తున్నారు. అంతే కాదు రెండు రేంజ్ లతో ఉన్న ఫారెస్ట్ డివిజనల్ కార్యాలయంలో 14 మంది సిబ్బంది ఉండాల్సి ఉండగా కేవలం ఉన్న నలుగురు సిబ్బంది అధిక పని భారంతోనే పనులు జరుగుతున్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

నేడు రాష్ట్రస్థాయిలో చీఫ్ ఫారెస్ట్ కన్జర్వేటర్ స్థాయిలో, జోనల్ స్థాయిలో విధులు నిర్వహిస్తున్న అనేక మంది నాటి డిఎఫ్ఓలు బెల్లంపల్లి అటవీ డివిజన్లో పని చేశారు. ఇంత పేరుగాంచిన బెల్లంపల్లి అటవీ డివిజన్ కార్యాలయం నేడు దయనీయస్థితిలో కొట్టుమిట్టాడడం పట్ల పలు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ, ఎమ్మెల్యే గడ్డం వినోద్, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, జిల్లా అటవీ శాఖ అధికారి శివ్ ఆశిష్ సింగ్, స్థానిక ఎఫ్ డి ఓవిజయ్ కుమార్ లు వెంటనే స్పందించి భవనం మరమ్మతులు చేయించడంతో పాటు తగు సిబ్బందిని నియమించాలని ప్రజలు కోరుతున్నారు.
