అన్ని స్థాయిల్లో పొదుపు చర్యలు అవసరం

అన్ని స్థాయిల్లో పొదుపు చర్యలు అవసరం

ప్రభుత్వ పథకాల అమలులో వ్యత్యాసాలు వద్దు
అధికారులు సమగ్ర పర్యవేక్షణ చేపట్టాలి
చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు

చిత్తూరు, ఆంధ్రప్రభ : ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ఎటువంటి వ్యత్యాసాలు లేకుండా అధికారులు సమగ్ర పర్యవేక్షణ చేపట్టాలని చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన అన్ని సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు పారదర్శకంగా, ఆలస్యం లేకుండా చేరేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని సూచించారు. గురువారం స్థానిక కలెక్టరేట్‌లోని నాగార్జున ఐఏఎస్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో చిత్తూరు జిల్లా అభివృద్ధిపై దిశా కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో జడ్పీ చైర్మన్ జి. శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఐసీడీఎస్ శాఖలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులను వెంటనే నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన సుమారు 70 సంక్షేమ పథకాల అమలు, నిధుల వినియోగం, పనుల పురోగతి, లబ్ధిదారుల వివరాలపై అధికారులు స్పష్టమైన అవగాహనతో పనిచేయాలని సూచించారు. ప్రతి శాఖలో రికార్డుల నిర్వహణ పారదర్శకంగా ఉండాలని, భవిష్యత్తులో ఎవరైనా ప్రశ్నించినా సమగ్ర వివరాలు అందించే విధంగా వ్యవస్థను రూపొందించాలని తెలిపారు.

అన్ని శాఖల అధికారులు తమ తమ విభాగాల్లో సమగ్ర పర్యవేక్షణ చేపట్టి ఎటువంటి తారతమ్యాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఎంపీ స్పష్టం చేశారు. ప్రజలకు అందే సేవల్లో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని, ప్రభుత్వ పథకాల అమలులో నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరించారు. దేశ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చుల నియంత్రణ, పొదుపు చర్యలపై దృష్టి సారిస్తున్నాయని ఎంపీ పేర్కొన్నారు. ప్రభుత్వ శాఖలతో పాటు ప్రతి కుటుంబం కూడా అనవసర ఖర్చులను తగ్గించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

ముఖ్యంగా ఆహార వ్యర్థాన్ని తగ్గించడం ద్వారా గ్యాస్ వినియోగం, ఇతర వనరుల వృథాను నివారించవచ్చని సూచించారు. విదేశీ మారక నిల్వల పరిరక్షణ కోసం బంగారం కొనుగోళ్లు తగ్గించడం, ఇంధన పొదుపు కోసం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడం వంటి చర్యలు దేశ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా అవసరమని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరూ మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా స్థాయిలో అధికారులు ప్రజలకు మార్గనిర్దేశకులుగా వ్యవహరించాలని, పొదుపు చర్యలు, వనరుల సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు.

వ్యవసాయ అనుబంధ రంగాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయని, వాటిపై రైతులకు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఎంపీ సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పేదల ఆర్థికాభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. ఆ పథకాల ఫలాలు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి చేరేలా అధికారులు కృషి చేయాలని కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వివిధ అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని ఎంపీకి వివరించారు. జిల్లాలో సుమారు 3,100 చెరువులకు సంబంధించిన ఫీడర్ ఛానళ్ల శుభ్రపరిచే పనులపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు.

గత ఏడాది మంచి వర్షాలు కురిసినప్పటికీ సుమారు 1,200 చెరువులు 70 శాతం కంటే తక్కువ స్థాయిలో మాత్రమే నిండాయని పేర్కొన్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఫీడర్ ఛానళ్ల శుభ్రపరిచే పనులను వేగవంతం చేస్తున్నామని చెప్పారు. మట్టి తొలగింపు, కాలువల శుభ్రపరిచే పనులు సమర్థవంతంగా జరిగితే ఈ ఏడాది చెరువులు పూర్తిస్థాయిలో నిండే అవకాశం ఉందన్నారు. మెటీరియల్ వైజ్ క్లీనింగ్ పనులకు అనుమతులు లభించాయని, లేబర్ పేమెంట్లతో పాటు మెటీరియల్ చెల్లింపుల ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు. బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, చెరువుల అభివృద్ధి పనులపై కూడా త్వరలో మరింత దృష్టి సారించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.

ఇప్పటికే వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన రూ.18 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, పనుల పురోగతిని అనుసరించి చెల్లింపులు జరుగుతాయని చెప్పారు. ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన కింద జిల్లాలో తొలి దశలో 66 ఎస్సీ గ్రామాలను ఎంపిక చేసి 437 పనులను ఆమోదించినట్లు కలెక్టర్ వెల్లడించారు. ప్రతి ఎస్సీ కాలనీలో సుమారు రూ.20 లక్షలతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఇప్పటివరకు 342 పనులకు సుమారు రూ.5 కోట్లు ఖర్చు చేసినట్లు, మరో 95 పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయని వివరించారు.

ఈ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి సుమారు రూ.4 కోట్లు రావాల్సి ఉందన్నారు. వివిధ సంక్షేమ పథకాల అమలుపై సంబంధిత అధికారులతో ఎంపీ ఆరా తీశారు. పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి, విద్య, వైద్యం, విద్యుత్, సంక్షేమ శాఖలు, వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులతో పథకాల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ రవికుమార్ నాయుడు, ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply