నీటి ఆవశ్యకత పై విద్యార్థులచే గేయం ఆవిష్కరణ…
నీటి ఆవశ్యకత పై విద్యార్థులచే గేయం ఆవిష్కరణ…
జననీ జన్మభూమిశ్చ” గేయాన్ని ఆవిష్కరించిన విద్యార్థులు..
రాష్ట్ర సాగునీటి సమితి ఆధ్వర్యంలో…
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : సాగునీటి ప్రాజెక్టులు, అభివృద్ధి తదితర అంశాలపై గత పదమూడేళ్ళుగా అనేక కార్యక్రమాలు చేపట్టిన రాయలసీమ సాగునీటి సాధన సమితి ప్రజలలో మరింత చైతన్యం తీసుకురావడానికి సాహిత్య రూపంలో గేయాలను విడుదల చేసింది.అందులో భాగంగా సోమవారం విద్యార్థులు, యువతతో ” జల ఆవశ్యకత – జల సంరక్షణ ” అంశంపై సమితి ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.
రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి విద్యార్థులతో మమేకమై “జలమే జీవం.. జలమే సంపద జలమే బలం.. జలమే సర్వస్వం..!” అని వివరిస్తూ సకల జీవరాసులకు నీటి ప్రాధాన్యత గురించి వివరించారు. ఏ ప్రాంతమైనా సమగ్ర అభివృద్ధి జరగాలంటే త్రాగు, సాగునీరు ముఖ్యమనీ, రాయలసీమకు అన్ని వనరులు వున్నప్పటికీ ఇంకా అభివృద్ధికి నోచుకోకపోవడం ఆవేదన కలిగిస్తోందనీ ఈ నేపథ్యంలో మన హక్కుల గురించి యువతలో చైతన్యం వచ్చి సాధించుకున్నప్పుడే మన జన్మభూమి అభివృద్ధి జరుగుతుందన్నారు. సమితి రూపొందించిన “జననీ జన్మభూమిశ్చ” గేయాన్ని విద్యార్థులతో ఘనంగా ఆవిష్కరించరు. ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక కన్వీనర్ ఆకుమల్ల రహీం, సమితి కార్యవర్గసభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.
