Yadagirigutta | 18 మందితో పాలక మండలి !

యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అభివృద్ధి కోసం కొత్త పాలకమండలి (ట్రస్టీల బోర్డు) ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ శాసనసభలో ప్రకటించారు.

తెలంగాణ అసెంబ్లీలో (మంగళవారం) దేవాదాయ చట్ట సవరణ బిల్లుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా దేవాదాయశాఖ‌ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ… యాదగిరిగుట్ట ఆలయానికి ఆలయ పాలక మండలిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలిపారు.

18 మంది సభ్యులతో యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు ఉంటుందని… ఈ బోర్డు పదవీకాలం రెండేళ్లుగా నిర్ణయించారని, బోర్డు సభ్యులకు ఎలాంటి జీతభత్యాలు ఉండవని స్పష్టంచేశారు. ఈ బోర్డు సభ్యులకు డీఏలు మాత్రమే ఉంటాయని మంత్రి కొండా సురేఖ వివరించారు.

ఆలయ ఈవోగా ఐఏఎస్ అధికారి ఉంటారని వెల్లడించారు. బోర్డు బడ్జెట్ ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటుందని.. బోర్డు ఆధ్వర్యంలోనే యాదగిరిగుట్టలో విద్యాసంస్థలను, ఆధ్యాత్మిక పాఠశాలలను నెలకొల్పి నిర్వహించవచ్చని తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో రాస్ట్రంలోని దేవాలయాలకు భక్తుల తాకిడి పెరిగిందన్నారు. గతంలో యాదగిరిగుట్ట ఆలయ భక్తులకు తగినంత సౌకర్యాలు లేవని, భక్తుల కోసం భారీ మొత్తంలో ప్రభుత్వ ఖజానా నుంచి నిధులు వెచ్చించామని మంత్రి తెలిపారు.

ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు పాలక మండలి అవసరమని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ పర్యవేక్షణలో ఆలయ పరిపాలన మరింత పారదర్శకంగా ఉంటుందని మంత్రి కొండా సురేఖ అభిప్రాయపడ్డారు. దేవాదాయ శాఖ పరిధిలో ఏటా రూ.100 కోట్ల ఆదాయం వచ్చే ఆలయాలను ప్రభుత్వమే నేరుగా నిర్వహించనుందని వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *