రిజిస్ట్రేషన్ ఆఫీసులో విజిలెన్స్ సోదాలు..!

రిజిస్ట్రేషన్ ఆఫీసులో విజిలెన్స్ సోదాలు..!

  • కీలక పత్రాలు స్వాధీనం..!
  • డాక్యుమెంట్ రైటర్ల ఫోన్ పే లావాదేవీల పరిశీలన..!

ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి అదిలాబాద్ : అవినీతి, అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన రిజిస్ట్రేషన్ ఆఫీసులపై విజిలెన్స్ అధికారుల వరుస దాడులు అలజడి రేపుతున్నాయి. మూడు రోజుల క్రితం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ దాడులు మర్చిపోకముందే గురువారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఆకస్మిక దాడులు సంబంధిత అధికారుల్లో దడ పుట్టించాయి. మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం వరకు బిజినెస్ అధికారుల బృందం ఆకస్మికంగా సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. ఆఫీస్ విధుల్లో ఉన్న సబ్ రిజిస్ట్రార్ తో పాటు రిజిస్ట్రేషన్ కార్యాలయ సిబ్బంది ఒక్కసారి అవాక్కయ్యారు. సూదాల సమయంలో సబ్ రిజిస్ట్రార్ విజయ కాంతారావు అక్కడే ఉన్నారు.

డాక్యుమెంట్ రైటర్ల ఫోన్ పే పరిశీలన..!
కరీంనగర్ రేంజ్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల బృందం విజిలెన్స్ సోదాలలో భాగంగా ఆదిలాబాద్ లోని డాక్యుమెంట్ రైటర్ ఆఫీసుల్లో అక్రమ వెంచర్లు లావాదేవీలను క్షుణ్ణంగా పరిశీలించారు. సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో అక్రమ వెంచర్లు, నిషేధిత భూములకు రిజిస్ట్రేషన్ చేస్తూ లంచాలకు మరిగినట్టు కొంతకాలంగా ఆరోపణలు వస్తున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్రమ దందాలకు పాల్పడుతున్నారని పలు ఆరోపణలు వచ్చాయి ఈ నేపథ్యంలోనే 9 మంది సభ్యుల విజిలెన్స్ బృందం సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో డాక్యుమెంట్ రైటర్ల లావాదేవీలు, సబ్ రిజిస్టర్ అక్రమ వెంచర్ల అవినీతిపై సోదాలు చేయడం జిల్లా కేంద్రంలో కలకలం సృష్టించింది. విచారణ అనంతరం నివేదిక ప్రభుత్వానికి సమర్పిస్తామని తనిఖీ బృందం సభ్యులు తెలిపారు.

Leave a Reply