విజయవాడలో గంజాయి ముఠా గుట్టురట్టు

విజయవాడలో గంజాయి ముఠా గుట్టురట్టు

-ఏడుగురు నిందితుల అరెస్ట్

పాయకాపురం, ఆంధ్రప్రభ: విజయవాడ నగరంలో మాదకద్రవ్యాల కట్టడికి పోలీసులు చేపట్టిన చర్యల్లో భాగంగా ఒక భారీ గంజాయి విక్రయ ముఠాను అజిత్ సింగ్ నగర్ పోలీసులు పట్టుకున్నారు. అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

నగరంలోని తోట వారి వీధి పరిసరాల్లో గుట్టుచప్పుడు కాకుండా గంజాయి విక్రయాలు సాగుతున్నట్లు అజిత్ సింగ్ నగర్ పోలీసులకు రహస్య సమాచారం అందింది. దీనిపై తక్షణమే స్పందించిన పోలీసులు సదరు ప్రాంతంలో మెరుపు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో గంజాయి విక్రయిస్తూ పట్టుబడ్డ నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో యోగానంద సునీత, చేబ్రోలు నవీన్, బాల ప్రశాంత్ కుమార్, తాడేపల్లి నాగబాబు (22), భూదాల విజయ్ (30), పరిటాల జోజి బాబు అలియాస్ సిద్దు (19), దాసరి వంశీ (24), మిండాల రత్నకుమార్ అలియాస్ బొంత (19)లతో పాటు మరికొందరు ఉన్నారు. వీరి వద్ద నుండి సుమారు 7 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ సందర్భంగా అజిత్ సింగ్ నగర్ సీఐ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల రవాణా లేదా విక్రయం వంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. యువత భవిష్యత్తును నాశనం చేసే ఇటువంటి ముఠాల పట్ల పోలీసులు నిరంతరం నిఘా ఉంచుతారని స్పష్టం చేశారు.

నగరంలో ఎక్కడైనా చట్టవిరుద్ధ కార్యకలాపాలు, మాదకద్రవ్యాల విక్రయాలు జరుగుతున్నట్లు గమనిస్తే వెంటనే అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని సీఐ కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.

ప్రస్తుతం నిందితులపై కేసులు నమోదు చేసిన పోలీసులు, ఈ గంజాయి నెట్‌వర్క్ వెనుక ఉన్న ఇతర వ్యక్తుల కోసం లోతైన దర్యాప్తు జరుపుతున్నారు.

Leave a Reply