Champions Trophy | ఫైనల్స్ కు అడుగుదూరంలో భారత్ – నేడు సెమీస్ లో ఆసీస్ తో అమీతుమీ…

దుబాయ్ వేదిక‌గా మ్యాచ్
టీమ్ ఇండియాతో అస్ట్రేలియా ఢీ
స్పిన్ తంత్రంతో రోహిత్ శ‌ర్మ‌
పేస్ ద‌ళాన్ని న‌మ్ముకున్న స్టీవ్ స్మిత్

దుబాయ్ – ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 తుది దశకు చేరుకుంది. మరో మూడు మ్యాచ్‌ల్లో ఛాంపియన్‌ ఆఫ్‌ ఛాంపియన్స్ ఎవరో తేలిపోనుంది ఇండియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, సౌతాఫ్రికా.. ఈ నాలుగు టీమ్స్‌లో ఏ జట్టు వరుసగా రెండు మ్యాచ్‌లు గెలుస్తుందో ఆ జట్టే ఛాంపియన్‌గా నిలుస్తుంది. ఇక టీమిండియా తొలి సెమీ ఫైనల్‌లో పటిష్టమైన ఆస్ట్రేలియాను నేడు ఢీ కొట్టనుంది. ఈ మ్యాచ్‌ దుబాయ్‌ వేదికగా ఈ మ్యాచ్ మ‌ధ్యాహ్నం 2.30 నిమిషాల‌కు ప్రారంభం కానుంది. ఆస్ట్రేలియాను సెమీస్‌లో ఓడిస్తే.. ఫైనల్‌లో సౌతాఫ్రికా లేదా న్యూజిలాండ్‌తో తలపడే అవకాశం ఉంది. ఫైనల్‌ చేరాలంటే ముందు సెమీస్‌లో ఆసీస్‌ గండాన్ని టీమిండియా దాటాల్సి ఉంది.

గతంలో పలు ఐసీసీ ఈవెంట్స్‌లో ఆస్ట్రేలియాను నాకౌట్‌ మ్యాచ్‌లలో ఓడించిన ఘనమైన రికార్డ్‌ టీమిండియాకు ఉంది. కానీ, 2023 వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లో మాత్రం రోహిత్‌ సేన ఆసీస్‌ చేతుల్లో ఓటమి పాలైంది. దానికి ప్రతీకారం తీర్చుకుంటూ ఈ ఛాంపియన్స్‌ ట్రోఫీ సెమీస్‌లో కంగారులను ఓడించాలని క్రికెట్‌ అభిమానులు కోరుకుంటున్నారు.

భారత్ రికార్డ్ ఘనం..

ఛాంపియ‌న్స్ ట్రోఫీ సెమీ ఫైన‌ల్స్‌లో టీమిండియా అద్భుత‌మైన రికార్డు క‌లిగి ఉంది. గ‌త 27 ఏళ్లుగా ఈ టోర్నీలో జ‌రిగిన సెమీస్‌లో భార‌త జ‌ట్టుకు ఓట‌మి అనేదే లేదు. సెమీ ఫైన‌ల్స్‌కు వెళ్లిన ప్ర‌తీసారి గెలిచి స‌గ‌ర్వంగా ఫైన‌ల్లో అడుగుపెట్టింది.  2000, 2002, 2013, 2017 సెమీ ఫైన‌ళ్ల‌లో విజ‌యాలు న‌మోదు చేసి త‌న ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించింది. కాగా, భార‌త్‌ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్‌కు చేరుకోవడం ఇది ఆరోసారి. ఇంతకుముందు ఐదుసార్లు సెమీస్ ఆడిన టీమిండియా నాలుగు సార్లు విజేత‌గా నిలిచింది. 1998లో ఒక‌సారి మాత్రం వెస్టిండీస్ చేతిలో ప‌రాజ‌యం పాలైంది. చివరిసారిగా 2017లో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్ ఆడింది. బర్మింగ్‌హామ్‌లో బంగ్లాదేశ్‌ను తొమ్మిది వికెట్ల తేడాతో ఓడించింది. ఆ త‌ర్వాత‌ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఫైనల్ ఆడింది. కానీ, ఫైన‌ల్లో టీమిండియాకు భంగ‌పాటు ఎదురైంది. దాంతో మూడో టైటిల్ చేజారింది. కాగా, మెన్ ఇన్ బ్లూ 2002, 2013 ఎడిషన్లలో విజేతగా నిలిచిన విష‌యం తెలిసిందే.

పిచ్ రిపోర్ట్ ..
ఇక మ్యాచ్‌ జరిగే ఈరోజు దుబాయ్‌లో ఉష్ణోగ్రత 24°C చుట్టూ ఉంటుందని అంచనా. పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందని, కానీ, మ్యాచ్‌ సాగుతున్న కొద్ది స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుందని సమాచారం. ఒక వేళ రోహిత్‌ శర్మ టాస్‌ గెలిస్తే తొలుత బ్యాటింగ్‌ చేసేందుకు మొగ్గుచూపుతాడని తెలుస్తోంది. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా టీమిండియా కేవలం 250 పరుగుల టార్గెట్‌ను రక్షించుకోగలిగింది. సో.. సెమీస్‌లో కూడా రోహిత్‌ సేమ్‌ స్ట్రాటజీతో ముందుకు వెళ్లే ఛాన్స్‌ ఉంది.

కానీ, ఈ పిచ్‌పై 63 శాతం ఛేజింగ్‌ చేసిన జట్లు గెలుపొందాయి. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో సెకండ్‌ ఇన్నింగ్స్‌ అంత సులువుగా కనిపించడం లేదు. ఇదే విషయాన్ని న్యూజిలాండ్‌తో మ్యాచ్‌ తర్వాత కూడా రోహిత్‌ ప్రస్తావించాడు . ఇక టీమిండియా న్యూజిలాండ్‌పై ఆడిన జట్టుతోనే ఆసీస్‌పై కూడా బరిలోకి దిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇద్దరు క్వాలిటీ స్పిన్నర్లు, ఒక పేసర్‌, ముగ్గురు ఆల్‌రౌండర్లతో భారత్‌ ఆడే ఛాన్స్‌ ఉంది.

టీమిండియా ప్లేయింగ్‌ 11 : రోహిత్ శర్మ(కెప్టెన్‌), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, మహ్మద్ షమీ.

ఆస్ట్రేలియా ప్లేయింగ్ 11 ):కూపర్ కొన్నెల్లీ, ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), మార్నస్ లబుషేన్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), అలెక్స్ కేరీ, గ్లెన్ మ్యాక్స్వెల్, బెన్ డ్వారిషూస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, తన్వీర్ సంఘా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *