Top Story | ఉగ్ర‌కుట్ర‌లో జ్యోతి మ‌ల్హోత్రా! పహల్గామ్‌ దాడివెనుక హ‌స్తం

కర్త, కర్మ మొత్తం ఆమేనా?
అందం ముసుగేసిన పాకిస్థాన్ స్పై
యూట్యూబ‌ర్ పేరుతో దేశ ద్రోహం
పాక్ స్పై ఏజెన్సీ ఐఎస్ఐతో సంబంధాలు
పంజాబ్ ప్రావిన్స్ సీఎం మ‌రియంతో భేటీలు
గూఢ‌చ‌ర్యం ఆరోప‌ణ‌ల‌కు మ‌రింత బ‌లం
ఎంక్వైరీలో బ‌య‌ట‌ప‌డుతున్న వాస్త‌వాలు

సెంట్ర‌ల్ డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ‌: యూట్యూబర్ ముసుగులో జ్యోతి మల్హోత్రా గూఢచారిగా మారింది. భారత సైనిక స్థావరాలను చిత్రీకరించి, దేశ రహస్యాలను పక్కాగా ఐఎస్​ఐ ఏజెంట్​ డానిష్‌కు చేరవేసింది. 2024లో హర్యానా-పంజాబ్ సరిహద్దుల్లో సంచరిస్తూ సైనికుల కదలికలను చేరవేస్తుండగా అనుమానం వచ్చి అరెస్టయ్యింది. ఆమె ఫోన్ పరిశీలించగా టెర్రరిస్టులతో సంబంధాలున్నట్లు నిర్ధారణ అయింది. ఇక.. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమెకు సంబంధించిన కొన్ని కొత్త కోణాలను దర్యాప్తులో భాగంగా వెలుగులోకి వచ్చినట్టు పోలీసులు తెలిపారు. పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి కేవలం రెండు నెలల ముందు, జ్యోతి మల్హోత్రా పాకిస్థాన్‌లో పర్యటించినట్లు పోలీసులు వెల్లడించారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు, ఫొటోలు

జ్యోతి మల్హోత్రా పాకిస్థాన్ పర్యటనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి. ఒక వీడియోలో మల్హోత్రా లాహోర్‌లోని ఒక రెస్టారెంట్‌లో కొంతమంది వ్యక్తులతో కలిసి భోజనం చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అయితే.. ఆమెతో పాటు ఉన్న ఆ వ్యక్తులు ఎవరు? అనే విషయంపై పోలీసులు ఇంకా స్పష్టతనివ్వలేదు.

మరియం నవాజ్‌తో ఫొటో.. తీవ్రమవుతున్న అనుమానాలు

జ్యోతి మ‌ల్హోత్రా విష‌యంలో అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే.. మరొక ఫొటోలో పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె, ప్రస్తుతం పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రిగా ఉన్న మరియం నవాజ్ షరీఫ్‌తో కలిసి కనిపించింది. ఈ ఫొటో ఇప్పుడు తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. పాక్‌లోని ఒక రాజకీయ నాయకురాలితో, అదీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్య‌క్తితో జ్యోతి మల్హోత్రాకు ఉన్న పరిచయంపై పోలీసులు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాలన్నీ జ్యోతి మల్హోత్రాపై ఉన్న గూఢచర్యం ఆరోపణలకు మరింత బలం చేకూరుస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. పహల్గామ్ ఉగ్రదాడితో ఆమె పాకిస్థాన్ పర్యటనకు ఏమైనా సంబంధం ఉందా? అన్న కోణంలో కూడా దర్యాప్తు అధికారులు లోతుగా విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

తెలియుదు.. గుర్తులేదు..

నేష‌న‌ల్ ఇన్వెస్టిగేష‌న్ ఏజెన్సీ యూట్యూబ‌ర్ జ్యోతిని విచారించి, కీలక ఆధారాలు సేకరించింది. వాట్సాప్ చాట్‌, టెలిగ్రామ్ సందేశాలు, ఫోన్ రికార్డులను అధికారులు ప‌రిశీలిస్తున్నారు. గతేడాది ఢిల్లీలో పాక్ హైకమిషన్ ఇఫ్తార్ విందు వీడియోపైనా ఆరా తీస్తోంది. అయితే.. పూర్తి సమాచారం తెలుసుకునేలా జ్యోతి సహకరించడం లేదని, నిజాలు దాచిపెడుతున్నట్లు ఎన్ఐఏఅనుమానిస్తోంది. జ్యోతి కేసు.. దేశ భద్రతకు సంబంధించి కీలకమైనది కావడంతో కేంద్రం ఉన్నత స్థాయి దర్యాప్తు సంస్థకు అప్పగించే యోచనలో ఉంది.

ఆ ఏజెన్సీకి.. అన్నింటినీ డీకోడ్ చేసే సామ‌ర్థ్యం

ఫెడరల్ యాంటీ-టెర్రర్ ఇన్వెస్టిగేషన్ సంస్థ.. ఇది ఎన్ఐఏలో ఓభాగం.. గూఢచర్యం వంటి తీవ్రమైన కేసులను ఈజీగా సాల్వ్ చేసిన రికార్డ్ ఈ సంస్థ‌కు ఉంది. అలాగే.. దీని దర్యాప్తు అంతర్జాతీయ స్థాయిలో ఉంటుంది. విచారణ తీరు కూడా చాలా కఠినంగా ఉంటుంది. సాక్ష్యాలు సేకరించడంలో నిపుణులు. డిజిటల్ ఆధారాలు, ఫోన్ రికార్డులు, సోషల్ మీడియా ఖాతాలను లోతుగా పరిశీలిస్తారు. నిందితులను మానసికంగా ఒత్తిడికి గురిచేసి నిజాలు రాబడతారు. ముఖ్యంగా డిజిటల్ ఫోరెన్సిక్స్, సైబర్ ట్రాకింగ్, ఎన్‌క్రిప్టెడ్ సందేశాల విశ్లేషణలో నిపుణులు.. వాట్సాప్, టెలిగ్రామ్ లాంటి ప్లాట్‌ఫారమ్‌లలో జ్యోతి పంపిన సమాచారాన్ని డీకోడ్ చేసే సామర్థ్యం ఈసంస్థకు ఉంది. జ్యోతి వీడియోల్లోని ప్యాటర్న్‌లను, జియో-లొకేషన్ డేటాను లోతుగా పరిశీలిస్తారు. ఐఎస్ఐ అధికారులతో జ్యోతి చాట్‌లను, ఫోన్ రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేయ‌నున్నారు..

గూఢ‌చ‌ర్యం కేసులో 14 మందిని అరెస్టు చేసిన ఎన్ఐఏ

ఫెడరల్ యాంటీ టెర్రర్ ఇన్విస్టిగేషన్‌ రంగంలోకి దిగితే జ్యోతి నిజాలు చెప్పే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఈసంస్థ‌ దర్యాప్తు వేగంగా, కచ్చితంగా ఉంటుంది. అలాగే జ్యోతి నోట్స్‌లో ఐఎస్ఐ అధికారులతో సమావేశాల వివరాలు, సైనిక స్థావరాల స్కెచ్‌లు ఉన్నట్లు తెలిసింది. ఒకవేళ ఫెడరల్ యాంటి టెర్రరిస్ట్ టీమ్‌ రంగంలోకి దిగితే, పాకిస్థాన్‌లోని ISI నెట్‌వర్క్, ఆమె ఆర్థిక లావాదేవీల వివరాలు తెలిసే అవకాశం ఉంది. జ్యోతి కేసు భారత భద్రతా వ్యవస్థకు పెను సవాలుగా మారింది. జ్యోతి నిజాలు చెప్పకపోతే ISI నెట్‌వర్క్, మనదేశంలో వారి ఏజెంట్ల సమాచారం బయటకు రాకపోవచ్చు. గత రెండు వారాల్లో దేశంలో మొత్తం 14 మందిని గూఢచర్యం ఆరోపణలపై అరెస్టు చేశారు, ఇంకా ఎంతమంది ఉన్నారన్నది తెలియాల్సి ఉంది. అందుకే ఫెడరల్ యాంటి టెర్రర్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ను రంగంలోకి దింపాలని కేంద్రం భావిస్తోంది.

Leave a Reply