గడువులోగా రైల్వే, జాతీయ రహదారి పనులు పూర్తి చేయాలి

గడువులోగా రైల్వే, జాతీయ రహదారి పనులు పూర్తి చేయాలి
భూసేకరణ వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశం
పెండింగ్ కోర్టు కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి
తిరుపతి, ఆంధ్రప్రభ : జిల్లాలో కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారుల నిర్మాణ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం తిరుపతి కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో జిల్లా రెవెన్యూ అధికారి జి. నరసింహులతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు.
రైల్వే ప్రాజెక్టులు, శ్రీ సిటీ ఫేజ్-2, ఎల్జీ ఫేజ్-2, కొల్లాడం, ఇరుగుళం, పెద్దేటిపాకం, రాళ్లకుప్పం, స్పేస్ సిటీ ఫేజ్ 1 నుంచి 4 వరకు, నాయుడుపేట ఫేజ్-2, వానెల్లూరు, పాగలి ప్రాంతాలకు సంబంధించిన భూసేకరణ, నిర్మాణ పనుల పురోగతిని కలెక్టర్ సమీక్షించారు. అలాగే జాతీయ రహదారులు, వైజాగ్–చెన్నై కారిడార్ పైప్‌లైన్, ఏడీబీ రోడ్లు, దుగ్గరాజపట్నం, కృష్ణపట్నం పోర్టు, ఏపీఐఐసీకి సంబంధించిన పెండింగ్ అంశాలపై చర్చించారు.
సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేసి భూసేకరణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ సూచించారు. పెండింగ్ కోర్టు కేసులు త్వరగా పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. వెబ్‌ల్యాండ్ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు.
నడికుడి–శ్రీకాళహస్తి, ఏర్పేడు–పూడి, గుమ్మడిపూండి–గూడూరు, గూడూరు–రేణిగుంట, తిరుపతి–కాట్పాడి, అర్కొనం–రేణిగుంట రైల్వే మార్గాల పనులను వేగవంతం చేయాలని సూచించారు. అలాగే నాయుడుపేట–రేణిగుంట, రేణిగుంట–కడప, రేణిగుంట–చెన్నై జాతీయ రహదారి పనులు త్వరగా పూర్తి చేయాలని చెప్పారు.
సాగరమాల కింద చేపట్టిన జాతీయ రహదారి ప్యాకేజీలు 2, 3, 4 పనులను నాణ్యతతో పూర్తి చేయాలని ఆదేశించారు. రెవెన్యూ, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, ఇరిగేషన్, ఫారెస్ట్ శాఖలు సమన్వయంతో పనిచేసి గడువులోగా పనులు పూర్తి చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో రైల్వే, నేషనల్ హైవే ప్రాజెక్టు అధికారులు, ఏపీఐఐసీ, ఇరిగేషన్ శాఖ అధికారులు, తహసీల్దార్లు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.
