13 ఏళ్ల సర్వీసు ఉన్నా దళిత ఉద్యోగిపై వేటు..?

13 ఏళ్ల సర్వీసు ఉన్నా దళిత ఉద్యోగిపై వేటు..?
కుల వివక్షతో నాపై అధికారి వేధిస్తున్నాడు
నేషనల్ పవర్ గ్రిడ్‌లో కుల చిచ్చు
నన్ను అంటరాని వాడిగా చూస్తూ నన్ను విధుల నుంచి తొలగించాడు
నా చేతితో పచ్చి మంచినీళ్లు కూడా తాగడు
ఒక దళితుడిగా పుట్టడమే నేను చేసిన తప్ప?
గత 13 సంవత్సరాలుగా నేను ఇక్కడే పనిచేస్తున్న
ఎప్పుడూ లేనిది ఇప్పుడే నా వల్ల సమస్యలు నిజంగానే ఉన్నాయా
2026 లో కూడా కుల వివక్ష పేరుతో దళిత కులాలని అంటరాని వారిగా చూడడం దారుణం అంటున్న.. తోటి ఉద్యోగులు
నాకు భార్య పిల్లలు ఉన్నారు అంటూ కాళ్లు పట్టుకున్న కనికరించలేదని కన్నీరు పెట్టుకుంటున్న ఓ నిరుపేద ఉద్యోగి
వరంగల్లో కూడా ఉద్యోగులను వేధిస్తే.. ఇక్కడికి బదిలీ చేసిన తీరు మార్చుకొని అధికారి… అని ఆరోపిస్తున్న ఉద్యోగులు
ఘట్ కేసర్, ఆంధ్రప్రభ : దేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో దూసుకుపోతున్నా, అగ్రరాజ్యాల సరసన నిలుస్తున్నా.. కొన్నిచోట్ల ఇంకా కుల వివక్ష అనే భూతం రాజ్యమేలుతూనే ఉంది. సమానత్వం కోసం రాజ్యాంగం కల్పించిన హక్కులు అటకెక్కుతున్నాయి. మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ ఎంఎంసి సర్కిల్ పరిధిలోని ఘనపూర్ నేషనల్ తెర్మల్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (ఎన్ టి పి సి)లో వెలుగుచూసిన కుల వివక్ష ఉదంతం ఇప్పుడు స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది. 13 ఏళ్లుగా నమ్మకంతో పనిచేస్తున్న ఒక దళిత ఉద్యోగిని, కేవలం కులం పేరుతో వేధిస్తూ విధుల్లోంచి తొలగించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

అంటరానితనం పాటిస్తున్నారంటూ బాధితుడి కన్నీటి పర్యంతం
ఘనపూర్ సబ్ స్టేషన్‌లో ఎర్రగుట్ట కరుణాకర్ అనే వ్యక్తి 2013 నుండి 13 సంవత్సరాలుగా ఏఎంసీ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నారు. గత ఐదుగురు ఇన్చార్జిల వద్ద ఎంతో క్రమశిక్షణగా పనిచేసిన కరుణాకర్ కు, ఇటీవల కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఇన్చార్జి ఎం. చంద్రశేఖర్ రెడ్డి వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని బాధితుడు ఆరోపిస్తున్నాడు. తాను దళిత (ఎస్సీ మాదిగ) కులానికి చెందిన వాడననే నెపంతో సదరు అధికారి తనను అంటరానివాడిగా చూస్తున్నారని, కనీసం తన చేతితో మంచినీళ్లు కూడా తాగడం లేదని కరుణాకర్ కన్నీరు మున్నీరయ్యాడు.

సీనియారిటీకి పాతర.. వివక్షే ప్రాతిపదిక?
కాంట్రాక్ట్ సంస్థ మారిన తరుణంలో ఉద్యోగుల సంఖ్య తగ్గించాల్సి వస్తే, నిబంధనల ప్రకారం జూనియర్లను తొలగించాలి. కానీ, గత ఆరు నెలల క్రితం చేరిన వారిని కొనసాగిస్తూ, 13 ఏళ్ల అనుభవం ఉన్న తనను తొలగించడం వెనుక కుల వివక్ష తప్ప వేరే కారణం లేదని బాధితుడు ఆరోపిస్తున్నాడు. నాకు భార్య పిల్లలు ఉన్నారు, నా పొట్ట కొట్టొద్దు అని కాళ్లు పట్టుకున్నా కనికరించలేదు అని కరుణాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఈ సబ్ స్టేషన్ లో పనిచేసిన ఐదుగురు ఇన్చార్జిల్లో బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన అధికారులు కూడా తనను ఎంతో గౌరవంగా చూశారని, కానీ ప్రస్తుత అధికారి ప్రవర్తన అత్యంత క్రూరంగా ఉందని కర్ణాకర్, తోటి ఉద్యోగులు తమపై అధికారి చంద్రశేఖర్ పై మండిపడుతున్నారు.
అధికారి అరాచకాలపై కార్మికుల తిరుగుబాటు..
సదరు అధికారిపై కేవలం కుల వివక్ష ఆరోపణలే కాకుండా, కార్మిక చట్టాల ఉల్లంఘన ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఉదయం 9 నుండి రాత్రి 8 గంటల వరకు పని చేయించుకుంటూ అదనపు వేతనం (ఓటి) ఇవ్వడం లేదని ఉద్యోగులు ఆరోపించారు.
బయోమెట్రిక్ అటెండెన్స్ లేకపోవడం, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించకపోవడంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళా కార్మికులతో భారమైన పనులు (గుంతలు తీయించడం వంటివి) చేయిస్తూ మానసికంగా వేధిస్తున్నారని మహిళలు ప్రతిరోజు తమతో కన్నీరు పెట్టుకుంటూ వేపపోతుంటారని తోటి కార్మికులు ఆరోపిస్తున్నారు.
అక్కడ ఉద్యోగులను వేధించినందుకే ఇక్కడికి ట్రాన్స్ఫర్..
ఘనపూర్ స్టేషన్ ఇంచార్జ్ చంద్రశేఖర్ రెడ్డి గతంలో వరంగల్ లో పనిచేసే సమయంలో తన కింద ఉండే కార్మికులను వేధించడంతో, అక్కడ ఉన్న కార్మికులు తిరుగుబాటు చేసి ధర్నాకు దిగారు దీంతో తక్షణమే స్పందించిన పై అధికారులు, చంద్రశేఖర్ రెడ్డిని ఘనపూర్ సబ్స్టేషన్ ఇన్చార్జిగా బదిలీ చేశారు. ఇక్కడికి వచ్చినప్పటికీ కుల వివక్ష పేరుతో, పై అధికారి అనే పొగరుతో నిత్యం తన కింద పని చేసే నిరుపేద కార్మికులను వేధిస్తున్నాడని కార్మికులు ఆరోపించారు.
న్యాయం జరిగే వరకు పోరాటం..
సహచర ఉద్యోగికి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ కార్మికులు నేషనల్ పవర్ గ్రిడ్ గేటు ముందు భారీ ధర్నా చేపట్టారు. ఈ క్రమంలో అధికారి బయటకు వచ్చి తమను బెదిరించారని వారు పేర్కొన్నారు. తక్షణమే హైదరాబాద్ రీజనల్ ఆఫీస్ ఉన్నతాధికారులు స్పందించి, విచారణ జరిపి కరుణాకర్‌ను విధుల్లోకి తీసుకోవాలని, కుల వివక్షకు పాల్పడుతున్న అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తోటి ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు……
