నియోజకవర్గ అభివృద్ధికి రూ.68.50 కోట్లతో రోడ్ల మంజూరు

నియోజకవర్గ అభివృద్ధికి రూ.68.50 కోట్లతో రోడ్ల మంజూరు
మక్తల్, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్ర పాడి, పశుసంవర్ధక, క్రీడా, డెయిరీ, మత్స్యశాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి శుక్రవారం మక్తల్ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రెస్ మీట్ నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో నియోజకవర్గానికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా వందల కోట్ల రూపాయల నిధులు అందించామని మంత్రి తెలిపారు.
ముఖ్యంగా ఒక్కరోజులో 68.50 కోట్ల రూపాయలతో 65 కిలోమీటర్ల మేర 19 రోడ్లను మంజూరు చేసుకున్నట్లు వెల్లడించారు. ఇందులో భూత్పూర్–కాట్రేవుపల్లి (3.5 కోట్లు), వనయకుంట–దాసర్ దొడ్డి (5 కోట్లు), దండు–కేశవ నగర్ (2.5 కోట్లు), అడవి సత్యారం–పెగడబండ (4 కోట్లు) తదితర ప్రధాన మార్గాలు ఉన్నాయి. మొత్తం 19 రోడ్లకు నిధులు కేటాయించారని మంత్రి చెప్పారు.
అదనంగా, ఆత్మకూరు–గద్వాల మధ్య బ్రిడ్జి పనులు శరవేగంగా జరుగుతున్నాయని, కొల్పూర్–కొర్తికుండ వద్ద మినీ జురాల డ్యామ్ కమ్ బ్రిడ్జి దాదాపు రూ.800 కోట్లతో త్వరలో ప్రారంభమవుతుందని, హిందూపూర్ వద్ద థర్మల్ పవర్ స్టేషన్‌కు గ్రీన్ సిగ్నల్ రానుందన్నారు.
వేటర్నరీ ట్రైనింగ్ సెంటర్, మినీ స్టేడియం, డిగ్రీ కాలేజ్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, చిట్యాల వాగు బ్రిడ్జి, మంథన్ గోడ్, గోలపల్లి, శ్రీపురం బ్రిడ్జి, నారాయణపేట వరకు నాలుగు లైన్ల రోడ్డు, 220 కేవీ సబ్ స్టేషన్, 150 పడకల ఆసుపత్రి నిర్మాణాలను మంత్రిత్వ శాఖ ప్రణాళికలో ఉంచినట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ బి. గణేష్ కుమార్, కో ఆప్షన్ మెంబర్ వల్లంపల్లి లక్ష్మణ్, కాంగ్రెస్ నాయకులు కట్టా సురేష్ కుమార్ గుప్తా, బోయ రవికుమార్, గాయత్రి అనిల్ కుమార్, రాజప్ప గౌడ, పరమేశ్ తదితరులు పాల్గొన్నారు.
