Super start for India | భారత్‌కు సూపర్ స్టార్ట్ !!
Super start for India | భారత్‌కు సూపర్ స్టార్ట్ !!
- పాకిస్థాన్‌పై 64 పరుగుల భారీ విజయం
- మంధానా అర్ధశతకం..
- దీప్తి పాంచ్ పటాకా..
- పాకిస్థాన్‌కు చుక్కలు చూపిన టీమిండియా
- పాక్‌ను చిత్తు చేసిన మహిళల జట్టు
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్-2026లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది (Super start for India). ఇంగ్లాండ్ లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను 64 పరుగుల తేడాతో చిత్తు చేసి టోర్నీలో విజయంతో బోణీ కొట్టింది. బ్యాటింగ్‌లో స్మృతి మంధానా అద్భుత అర్ధశతకంతో మెరవగా.. బౌలింగ్‌లో దీప్తి శర్మ ఐదు వికెట్లతో చెలరేగి భారత్ విజయానికి బాటలు వేసింది.
ముందుగా టాస్ గెలిచి భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, షెఫాలీ వర్మ (6) త్వరగా ఔటైనా, స్మృతి మంధానా నిలకడగా ఆడింది. జెమిమా రోడ్రిగ్స్ (1) నిరాశపరిచినప్పటికీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌తో కలిసి మంధానా మూడో వికెట్‌కు 91 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. మంధానా 44 బంతుల్లో 68 పరుగులు (9 ఫోర్లు, 2 సిక్సర్లు) చేసి జట్టుకు బలమైన పునాది వేసింది. హర్మన్‌ప్రీత్ 36 పరుగులు చేయగా, చివర్లో రిచా ఘోష్ 17 బంతుల్లో 34 పరుగులతో మెరుపులు మెరిపించింది. దీంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది.
దీప్తి శర్మ ధాటికి కుప్పకూలిన పాక్
171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ పవర్‌ప్లేలో 52 పరుగులు చేసి మంచి ఆరంభం చేసింది. కానీ ఆ తర్వాత భారత స్పిన్నర్లు మ్యాచ్‌ను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మునీబా అలీ 41 పరుగులతో పోరాడినా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. దీప్తి శర్మ అద్భుతంగా బౌలింగ్ చేసి 4 ఓవర్లలో కేవలం 10 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టింది. శ్రీ చరణి 3/21తో ఆకట్టుకుంది. ఫలితంగా పాకిస్థాన్ 17 ఓవర్లలో 106 పరుగులకే ఆలౌట్ అయింది.
