జాతీయ రహదారిపై ఆర్మూర్ ఎమ్మెల్యే నిర్బంధం..
- గంటన్నర పాటు వాహనంలోనే కూర్చున్న వైనం
- ఆ తర్వాత కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కు తరలించిన పోలీసులు
- బిక్కనూరు టోల్ ప్లాజా వద్ద హై డ్రామా
- పోలీసుల తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం
బిక్కనూరు, ఆంధ్రప్రభ : కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల పరిధిలోని టోల్ ప్లాజా వద్ద సోమవారం ఉదయం హైడ్రామా చోటుచేసుకుంది. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని పోలీసులు అడ్డుకోవడంతో ఆయన సుమారు గంటన్నరపాటు తన కారులోనే కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం పోలీసులు ఆయనను కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి క్యాంపు కార్యాలయానికి తరలించారు.
వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ నుంచి ఆర్మూర్‌కు వెళ్తున్న ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని భిక్కనూరు టోల్ ప్లాజా వద్ద పోలీసులు నిలిపివేశారు. ఆర్మూర్‌లో ప్రస్తుతం పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయని, ఆయన అక్కడికి వెళితే పరిస్థితులు మరింత దిగజారే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.

దీంతో తనను ఎందుకు అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యే పోలీసులను ప్రశ్నించారు. తన సొంత నియోజకవర్గానికి వెళ్లకుండా అడ్డుకోవడం సరికాదని, తాను వాహనం నుంచి దిగబోనని కారులోనే కూర్చుని నిరసన తెలిపారు. ఈ ఘటనతో అక్కడ స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, పోలీసులు భారీగా మోహరించారు.
చివరికి భిక్కనూరు సీఐ జగడం నరేష్ ఆధ్వర్యంలో పోలీసులు ఎస్కార్ట్ మధ్య ఎమ్మెల్యేను కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి క్యాంపు కార్యాలయానికి తరలించారు. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తన నియోజకవర్గానికి వెళ్లకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని విమర్శించారు.
