శ్రీశైలం పుణ్య క్షేత్రంలో ఘనంగా హనుమజ్జయంతి వేడుకలు..

శ్రీశైలం పుణ్య క్షేత్రంలో ఘనంగా హనుమజ్జయంతి వేడుకలు..
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : జ్యోతిర్లింగాలలో ఒకటైనా నంద్యాల జిల్లాలో శ్రీశైలం లోని భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానంలో హనుమజ్జయంతిని పురస్కరించుకుని శ్రీ భక్తాంజనేయస్వామివారికి విశేషపూజలు నిర్వహించబడ్డాయని కార్యనిర్వాహణాధికారి తెలిపారు. శ్రీశైలంలోని పాతాళగంగమార్గంలో శ్రీ భక్తాంజనేయస్వామివారి ఆలయంలో ఈ ప్రత్యేక పూజలు జరిపించబడ్డాయన్నారు.

లోక కల్యాణం కోసం జరిపిన ఈ విశేషపూజలలో భాగంగా ముందుగా దేశం శాంతి సౌభాగ్యాలలో విలసిల్లాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి దేశం పాడిపంటలతో తులతూగాలని, జనులందరికి ఆయురారోగ్యాలు కలిగి, వారికి అకాల మరణాలు రాకుండా ఉండాలని, దేశంలో అగ్ని, వాహన ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని అర్చకులు సంకల్పాన్ని చెప్పారు. తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు మహాగణపతి పూజ జరిపించబడిందన్నారు.
అనంతరం భక్తాంజనేయస్వామి వారికి ఆయా సూక్తాలతో పంచామృతాభిషేకం, జలాభిషేకం జరిపించబడ్డాయన్నారు. తరువాత స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి అష్టోత్తరపూజ, నాగవల్లిదళపూజ ఆకుపూజ, వడమాల సమర్పణ, పుష్పార్చన జరిపించబడ్డాయన్నారు. ఈ కార్యక్రమములో కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు, దేవస్థానం అధికారులు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.
