ram pothineni | దర్శకుడిగా రామ్ పోతినేని కొత్త ప్రయాణం

ram pothineni | దర్శకుడిగా రామ్ పోతినేని కొత్త ప్రయాణం

హీరోగా నటిస్తూనే కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం, సహ నిర్మాతగా నాలుగు బాధ్యతలు
రూ.100 కోట్ల బడ్జెట్‌తో స్టైలిష్ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్.. 2026 డిసెంబర్‌లో విడుదల లక్ష్యం

ram pothineni | హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని సినీ కెరీర్‌లో మరో కీలక అడుగు వేశారు. హీరోగా నటిస్తూనే తొలిసారి స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న ‘రాపో 23’ చిత్రం సోమవారం అధికారికంగా ప్రారంభమైంది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ సమీపంలోని ఓ ఫామ్‌హౌస్‌లో పూజా కార్యక్రమాలతో సినిమా రెగ్యులర్ షూటింగ్‌కు శ్రీకారం చుట్టారు.

సినిమా ప్రారంభం సందర్భంగా రామ్ పోతినేని తన సామాజిక మాధ్యమాల్లో “ఒంటరి తోడేలు ప్రయాణం మొదలైంది” అంటూ పోస్టు చేసి అభిమానుల్లో ఆసక్తిని పెంచారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్న రామ్, సహ నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. దీంతో ఒకే చిత్రంలో నటుడు, కథా రచయిత, దర్శకుడు, సహ నిర్మాతగా నాలుగు బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

‘రాపో సినిమాటిక్స్’ బ్యానర్‌పై రామ్ సోదరుడు కృష్ణ పోతినేని ఈ చిత్రాన్ని సుమారు రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. స్టైలిష్ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో రామ్ ‘వీర’ అనే విభిన్నమైన, శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది.

ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ తిరు ఛాయాగ్రహణం అందిస్తుండగా, మలయాళ సంగీత దర్శకుడు సామ్ సీ.ఎస్. సంగీతాన్ని సమకూరుస్తున్నారు. హీరోయిన్‌తో పాటు ఇతర నటీనటులు, సాంకేతిక బృందానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో ప్రకటించనున్నట్లు మేకర్స్ తెలిపారు.

భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ చిత్రాన్ని 2026 డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. రామ్ పోతినేని తొలిసారి మెగాఫోన్ పట్టిన ఈ చిత్రం టాలీవుడ్‌లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.