ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలి

ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలి

  • పీఆర్‌టీయూ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు నరేంద్రబాబు

కడెం, ఆంధ్రప్రభ : ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలను జూన్ 2లోపు ప్రభుత్వం పరిష్కరించాలని, లేనిపక్షంలో దశలవారీగా పోరాటాన్ని ఉదృతం చేస్తామని పీఆర్‌టీయూ టీఎస్ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు టీ. నరేంద్రబాబు, ప్రధాన కార్యదర్శి బి.వి. రమణరావు హెచ్చరించారు.

కడెం మండలం అంబారిపేట్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన అత్యవసర సర్వసభ్య సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్టీయూ నిర్మల్ జిల్లా మాజీ అధ్యక్షుడు సిలివేరి లక్ష్మీనరసయ్య తన పూర్వ సంఘానికి రాజీనామా చేసి పీఆర్‌టీయూ టీఎస్ సంఘంలో చేరారు. అలాగే పాఠశాల హెడ్‌మాస్టర్ వి. రమేష్, జీవశాస్త్ర ఉపాధ్యాయుడు పి. సురేష్ కూడా సభ్యత్వం స్వీకరించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సంఘంలో చేరిన ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి సంఘం కట్టుబడి పనిచేస్తుందని పేర్కొన్నారు. ముఖ్యంగా పీఆర్‌సీ, హెల్త్ కార్డులు, పెండింగ్ బిల్లులు, 2003 డీఎస్సీ అభ్యర్థులకు పాత పెన్షన్ పునరుద్ధరణ (సీపీఎస్ రద్దు) వంటి అంశాలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

జూన్ 2లోపు సమస్యలు పరిష్కరించకపోతే జేఏసీ ఆధ్వర్యంలో దశలవారీ నిరసనలు చేపడతామని తెలిపారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 17, మే 5, మే 14 తేదీలలో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పీఆర్‌టీయూ కడెం మండల అధ్యక్షుడు బి. వెంకటరమణ, ప్రధాన కార్యదర్శి బి. మహేశ్వర్, నాయకులు ఎన్. ప్రభాకర్, వి. కిషన్, జే. రవీందర్, ప్రేమ్ దాస్, కె. శ్రీనివాస్, అఖిల్, అంజుమ్, షరీన్, వెంకటనారాయణ, రాజన్న, భూమారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply