POCSO case | జైలు గోడ దూకి ఖైదీ పరార్…

POCSO case |మహబూబ్‌నగర్, క్రైం, ఆంధ్రప్రభ : మహబూబ్‌నగర్ జిల్లా జైలు నుంచి ఓ రిమాండ్ ఖైదీ పరారవడం కలకలం రేపింది. పోక్సో కేసులో అరెస్టై రిమాండ్‌లో ఉన్న కిశోర్ కుమార్ అనే ఖైదీ ఇవాళ‌ ఉదయం జైలు నుంచి తప్పించుకున్నాడు.

అమరచింత మండలం నందిమల్ల గ్రామానికి చెందిన కిశోర్ కుమార్ (22) సుమారు 25 రోజుల క్రితం పోక్సో కేసులో అరెస్టై జిల్లా జైలులో ఉన్నాడు. జైలు క్యాంటీన్‌లో విధులు నిర్వహిస్తున్న అతడు, బాత్రూమ్‌కు వెళ్తున్నానని చెప్పి బ్యారక్ నుంచి బయటకు వెళ్లాడు. అనంతరం నాలుగు టవళ్లను ముడివేసి తాడుగా తయారు చేసి జైలు గోడపై నుంచి దూకి పరారైనట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

పరారైన కిశోర్ కుమార్ ప్రియురాలు ప్రస్తుతం వనపర్తి జిల్లా సఖి కేంద్రంలో ఉన్నట్లు సమాచారం. ఆమెను కలిసేందుకే జైలు నుంచి తప్పించుకున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఖైదీ పరారీ ఘటనపై జోగులాంబ జోన్ డీఐజీ ఎల్‌.ఎస్‌. చౌహాన్ స్పందించి జిల్లా జైలు సూపరింటెండెంట్ శశికాంత్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఘటనపై సమగ్ర నివేదిక కోరినట్లు సమాచారం. కేసు నమోదు చేసిన మహబూబ్‌నగర్ వన్‌టౌన్ పోలీసులు ప్రత్యేక బృందాలతో పరారీలో ఉన్న ఖైదీ కోసం గాలింపు చేపట్టారు. జైలు నుంచి ఖైదీ ఎలా తప్పించుకున్నాడనే అంశంపై కూడా అధికారులు అంతర్గత విచారణ ప్రారంభించారు.