Operation Sindoor | మ‌ట్టి దిబ్బ‌లుగా ఉగ్ర‌వాదులు స్థావ‌రాలు… శాటిలైట్ ఫోటోలు విడుద‌ల

న్యూ ఢిల్లీ -ఆపరేషన్ సిందూర్’ పేరిట భారత సైన్యం చేపట్టిన మెరుపు దాడుల దెబ్బకు పాకిస్థాన్ విలవిల్లాడింది. పాక్, ఏఓకేలోని ఉగ్రకోటలు మట్టిదిబ్బలుగా మారాయి. జైషే మహ్మద్, లష్కరే తోయిబా ఉగ్రముఠాల స్థావరాలు ధ్వంసం అయ్యాయి. అందుకు సంబంధించిన ఉపగ్రహ చిత్రాలు తాజాగా బయటికొచ్చాయి.

శిథిలావస్థకు చేరిన ఉగ్రస్థావరాలు
భారత్ జరిపిన వైమానిక దాడుల్లో బహవల్‌ పూర్​లోని జైషే మహ్మద్‌ ప్రధాన కార్యాలయం, మురీద్కేలోని లష్కరే తోయిబా ఉగ్ర క్యాంప్​లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అవి దాదాపు శిథిలావస్థకు చేరుకున్నాయి. వాటి శాటిలైట్‌ చిత్రాలను మాక్సర్‌ టెక్నాలజీ తీసింది.

జైషే మహ్మద్ హెడ్​క్వార్టర్

టెర్రర్ గ్రూప్ జైషే మహ్మద్​కు బహవల్‌పూర్‌లోని మర్కజ్ సుబాన్​లో ఉగ్ర శిక్షణ, భోదనకు ప్రధాన కేంద్రంగా ఉంది. ఇక్కడి నుంచే పుల్వామా దాడి సహా అనేక ఉగ్రకుట్రలకు ఆ సంస్థ ప్రణాళికలు వేసింది. మర్కజ్​లో జైషే మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్, ఆయన కుటుంబ సభ్యులు, ఇతర గ్రూప్ సభ్యులు ముఫ్తీ అబ్దుల్ రౌఫ్ అస్గర్, మౌలానా అమర్ నివాసాలు ఉన్నాయి. ఈ కేంద్రం నుంచే మసూద్ అజార్ భారత వ్యతిరేకంగా, యువత ఇస్లామిక్ జిహాద్​లో చేరాలని కోరుతూ అనేకసార్లు ప్రసంగాలు చేశారు. ఆయుధ, మతపరమైన శిక్షణను ఇచ్చారు. అయితే భారత్ చేసిన మెరుపు దాడిలో బహవల్​పూర్​లోని మర్కజ్ సుబాన్ పూర్తిగా ధ్వంసమైంది.

ముర్కీదేలోని మర్కజ్ తోయిబా ధ్వంసం

అలాగే భారత్ జరిపిన దాడులకు మురీద్కేలోని లష్కరే తోయిబా ఉగ్రస్థావరం శిథిలావస్థకు చేరుకున్నట్లు ఉపగ్రహ చిత్రాల్లో కన్పిస్తోంది. మురీద్కేలోని మర్కజ్ తోయిబా లష్కరే తోయిబాకు అత్యంత ముఖ్యమైన శిక్షణా కేంద్రం. ఈ కాంప్లెక్స్​లో ఆయుధాలు, భౌతిక శిక్షణ ఇస్తారు. ఈ మర్కజ్​లో ఏటా వివిధ కోర్సుల్లో దాదాపు 1000 మంది చేరుతున్నారు. అజ్మల్ కసబ్​తో సహా 26/11 ముంబయి దాడికి పాల్పడిన వారందరికీ ఈ కేంద్రంలో ‘దౌరా-ఎ-రిబ్బత్’ (ఇంటెలిజెన్స్ శిక్షణ) ఇచ్చారు. ముంబయి దాడుల ప్రధాన కుట్రదారులు డేవిడ్ కోల్‌ మన్ హెడ్లీ, తహవూర్ హుస్సేన్ రాణా మురీద్కేను సందర్శించారు.

నాలుగు భవనాలు ధ్వంసం!
ఇండియన్ ఆర్మీ జరిపిన దాడుల్లో మురీద్కేలోని నాలుగు భవనాలు కుప్పకూలినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. “మంగళవారం అర్ధరాత్రి సమయంలో భారత్ రెండు క్షిపణులను ప్రయోగించింది. మిగిలిన రెండు దాడులను కొద్దిసేపు తర్వాత చేపట్టింది. మొత్తం నాలుగు దాడులు పది నిమిషాల కంటే తక్కువ వ్యవధిలో జరిగాయి. దీంతో నాలుగు భవనాలు కుప్పకూలాయి.” అని తెలిపింది.

బహవల్‌పూర్​లో ధ్వంసమైన భవనాలు


“మంగళవారం రాత్రి 12.45 గంటలకు మొదట ఒక డ్రోన్ వచ్చింది. తర్వాత మరో మూడు వచ్చాయి. అవి మసీదు పైకప్పును ధ్వంసం చేశాయి. పైకప్పుపై కూర్చుని ఉన్న వ్యక్తి ఒకరు చనిపోయాడు.” అని ముర్కేదీ వాసి ఒకరు మీడియాకు తెలిపారు. అలాగే ప్రజలు భయంతో పొలాల్లోకి, బహిరంగ ప్రదేశాల్లోకి పారిపోయారని మరో స్థానికుడు వెల్లడించాడు.

మరోవైపు, భారత్ జరిపిన వైమానిక దాడుల్లో చనిపోయినవారి సంఖ్య 102 కి చేరుకుందని పాకిస్థాన్ ఆర్మీ ప్రతినిధి తెలిపారు. మరో 46 మంది గాయపడ్డారని వెల్లడించారు.

Leave a Reply