Non Local Quota Lifted | ఇక అక్కడ వ‌ర్శిటీల‌లో అన్ని సీట్లు ఎపి వారికే ….

విజ‌య‌వాడ – వృత్తి విద్య, డిగ్రీ, ఇంజినీరింగ్ వంటి ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు ఇప్పటివరకు అమలవుతున్న 15 శాతం స్థానికేతర (నాన్ లోకల్), జనరల్ కోటా సీట్ల విషయంలో ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటివరకు నాన్ లోకల్ కోటా కింద 15 శాతం సీట్లలో తెలంగాణకు చెందిన వారికి అవకాశం కల్పిస్తుండగా, ఇక నుంచి పూర్తిగా ఏపీ వారికే కేటాయించనున్నారు.

రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తయిన నేపథ్యంలో ఉన్నత విద్య, వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలు, ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిబంధనల్లో స్థానిక, స్థానికేతరులను స్పష్టం చేస్తూ ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ వేర్వేరుగా మూడు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అక్కడి వర్సిటీల్లోని 15 శాతం కోటాలో ఏపీ వారికి అవకాశం లేకుండా ఉత్తర్వులు జారీ చేయగా, ఇప్పుడు ఏపీ ప్రభుత్వం సైతం ఇక్కడి వర్సిటీల్లో తెలంగాణ వారికి అవకాశం లేకుండా ఉత్తర్వులు ఇచ్చింది. కన్వీనర్ కోటా సీట్లలో 85 శాతం సీట్లను స్థానికులకు కేటాయిస్తారు.

స్థానికత ఏపీలో రెండు రీజియన్లుగా ఉంటుంది. ఆంధ్ర విశ్వవిద్యాలయం, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం రీజియన్లుగా దీన్ని నిర్ణయిస్తారు. ఉమ్మడి ఏపీ, విభజన అనంతరం పదేళ్లపాటు ఆంధ్ర, శ్రీ వేంకటేశ్వర, ఉస్మానియా రీజియన్లుగా సీట్ల భర్తీ చేయగా, ఇప్పుడు ఉస్మానియా రీజియన్‍ను తొలగించారు. ఇక నుంచి ఆంధ్ర, శ్రీ వెంకటేశ్వర రీజియన్ల వారీగా మాత్రమే సీట్లను భర్తీ చేయనున్నారు.

Leave a Reply