అన్నాడీఎంకే లో చీలక తప్పదా?

అన్నాడీఎంకే లో చీలక తప్పదా?

ఆంధ్రప్రభ, వెబ్‌ డెస్క్‌ : తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ ఊహించని మలుపులతో వేడెక్కుతుంటాయి. ఇప్పుడు తాజాగా ప్రధాన ప్రతిపక్షం అన్నా డీఎంకే లో మునుపెన్నడూ లేని విధంగా ముసలం పుట్టింది. మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి నాయకత్వానికి సొంత పార్టీ ఎమ్మెల్యేలే షాక్ ఇస్తున్నారా? దళపతి విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం పార్టీ ఇప్పుడు అన్నా డీఎంకేలో చీలికకు కారణమవుతోందా? అంటే అవుననే అంటున్నాయి తాజా రాజకీయ పరిణామాలు.

విజయ్‌తో పొత్తు.. పళనిస్వామికి విపత్తు?
సినీ నటుడు విజయ్ రాజకీయ అరంగేట్రం చేసినప్పటి నుండి తమిళనాట సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకేతో పొత్తు పెట్టుకోవాలని అన్నాడీఎంకేలోని మెజారిటీ నాయకులు భావిస్తున్నారు. అయితే, దీనికి పళనిస్వామి ససేమిరా అనడమే ఇప్పుడు పార్టీలో చిచ్చు రేపినట్లు తెలుస్తోంది. విజయ్‌తో జట్టు కడితేనే పార్టీకి భవిష్యత్తు ఉంటుందని సీనియర్ నేతలు షణ్ముగం, వేలుమణి, విజయభాస్కర్ వంటి వారు గట్టిగా నమ్ముతున్నారు.

17 వర్సెస్ 30?
ప్రస్తుతం అన్నాడీఎంకేకు ఉన్న 47 మంది ఎమ్మెల్యేలలో పళనిస్వామికి మద్దతు తగ్గుతోందా అన్న అనుమానాలు బలపడుతున్నాయి.
కేవలం 17 మంది ఎమ్మెల్యేలు మాత్రమే పళనిస్వామిని శాసనసభ పక్ష నేతగా చేయాలని ప్రొటెం స్పీకర్‌కు విన్నవించడం ఇప్పుడు సంచలనంగా మారింది. మిగతా 30 మంది ఎమ్మెల్యేలు పళనిస్వామి తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, వారు విజయ్ పార్టీకి మద్దతు ఇచ్చేందుకు లేదా వేరు కుంపటి పెట్టుకునేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం.

సీనియర్ల తిరుగుబాటు..
ఒకప్పుడు జయలలిత నాయకత్వంలో తిరుగులేని శక్తిగా ఉన్న అన్నాడీఎంకే ఇప్పుడు గ్రూపు రాజకీయాలతో కునారిల్లుతోంది. పళనిస్వామి ఒంటెద్దు పోకడల వల్లే పార్టీ బలహీనపడుతోందని సీనియర్ నేతలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా షణ్ముగం లాంటి కీలక నేతలు విజయ్‌కు మద్దతు ఇవ్వాలని పట్టుబడుతుండటం, ఈపీఎస్‌ దాన్ని వ్యతిరేకించడం పార్టీని రెండు ముక్కలు చేసేలా కనిపిస్తోంది.

Leave a Reply