బాణసంచా కేంద్రంలో భారీ విస్పోటనం

  • ఆరుగురు పరిస్థితి విషమం
  • ఉలిక్కి పడిన అంబేద్కర్ జిల్లా
  • భద్రత లోపాలే కారణం
  • విచారణ కు ప్రభుత్వం ఆదేశం…

( ఆంధ్రప్రభ, కాకినాడ బ్యూరో ) : డాక్టర్ బి అర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజక వర్గ పరిధిలోని రాయవరం మండలం కొమరిపాలెం లో బుదవారం భారీ పేలుడు సంభవించింది. పంట పొలాల మధ్య బాణా సంచా తయారీ కేంద్రంలో అకస్మిక విస్ఫోటనంలో ఏడుగురు దుర్మరణం చెందారు. దీపావళికి సర్వసన్నద్ధం అవుతున్న వేళ పెద్ద మొత్తం లో బాణా సంచా తయారీ చేస్తుండగా ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనంలో మందు గుండు తయారీ కూలీలు ఆరుగురు అక్కడిక్కడే ప్రాణాలు వదిలారు. బాణాసంచా తయారీ యజమాని కూడా మృతి చెండాడు. పలువురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమం గా ఉన్నట్లు సమాచారం.


మృతులు పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో డాక్టర్ బి అర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఒక్కసారిగా ఉలిక్కి పడింది .సరైనా భద్రత నియమాలు పాటించకపోవడమే కారణమని ప్రాథమికంగా చెబుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం నిలువునా కనిపిస్తోందని స్థానికులు చెబుతున్నారు. దీనిపై విచారణ కు ప్రభుత్వం ఆదేశం ఇచ్చింది. జిల్లా లోని కొమరి పాలెం లక్ష్మి గణపతి ఫైర్ వర్క్స్ లో బుదవారం ఒక్కసారి గా మంటలు చేల రేగి విస్పోటం జరిగింది. భారీ పేలుడు తో ఒక్కసారిగా నిప్పు రవ్వలు ఎగిసిపడ్డాయి. అక్కడ సుమారు 20 మంది కూలీలు పని చేస్తుండగా యజమాని తో సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.

బాణాసంచా తయారీ కేంద్రం యజమాని వెలుగు బంట్ల సత్యనారాయణ మూర్తి అలియాస్ సత్తిబాబు, అనపర్తికి చెందిన చిత్తూరు శ్యామల పర్తి, అనపర్తి సావరం ప్రాంతానికి చెందిన కురుపుడి జ్యోతి పెంకే శేషారత్నం, రాయవరం మండలం సోమేశ్వరం గ్రామానికి చెందిన పాక అరుణ , పెడపూడి మండలం వేండ్ర గ్రామానికి చెందిన లింగా వెంకట కృష్ణ , మరో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెండారు. క్షతగాత్రులను రామచంద్రపురం ఏరియా ఆసుపత్రి కి తరలించారు. మండపేట, రామచంద్రపురం, అనపర్తి నుండి అగ్నిమాపక శకటాలు హుటా హుటిన ప్రమాద స్థలికి చేరుకున్నాయి. క్షతగాత్రులను అంబులెన్స్ ల్లో ఆసుపత్రి కి తరలించారు. మండపేట రూరల్ సి ఐ దొర రాజు హుటాహుటిన ప్రమాద స్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. తీవ్రం గా గాయపడ్డ కూలీలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని చెప్పారు.

అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాయవరంలో బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాద ఘటన కలచి వేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ఎక్స్‌ వేదికగా సీఎం స్పందిస్తూ.. ఈ ఘోర ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆవేదన కలిగించిందన్నారు. ప్రమాద కారణాలు, ప్రస్తుత పరిస్థితి, సహాయక చర్యలు, వైద్య సాయంపై అధికారులతో మాట్లాడినట్లు తెలిపారు. స్వయంగా సంఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొనాలని ఉన్నతాధికారులను ఆదేశించామన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయం అందించాలని సూచించామని.. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇస్తూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. ఇక డిప్యూటీ సీఎం వవన్ కళ్యాణ్ దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. క్షతగాత్రులు కోలుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. మంత్రి లోకేష్, హోంమంత్రి అనిత తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

Leave a Reply