markets | సెన్సెక్స్ 650 పాయింట్లు డౌన్.. రూపాయి కనిష్ఠానికి

markets | సెన్సెక్స్ 650 పాయింట్లు డౌన్.. రూపాయి కనిష్ఠానికి
markets | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఇవాళ కూడా నష్టాలతోనే ప్రారంభమయ్యాయి. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, చమురు ధరల పెరుగుదల, అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాల ప్రభావంతో మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి పెరిగింది. ఇదే సమయంలో రూపాయి మారకం విలువ జీవనకాల కనిష్ఠానికి పడిపోవడం పెట్టుబడిదారుల్లో ఆందోళన పెంచుతోంది.
ఉదయం 9.37 గంటల సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్ 656 పాయింట్లు కోల్పోయి 75,369 వద్ద కొనసాగుతోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 171 పాయింట్లు తగ్గి 23,641 వద్ద ట్రేడవుతోంది. ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా, విప్రో, హెచ్‌సీఎల్ వంటి ఐటీ కంపెనీల షేర్లు భారీగా పడిపోయాయి. మదుపర్లు అమ్మకాలకు దిగడంతో ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు మూడు శాతం వరకు క్షీణించాయి.
డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ మరింత బలహీనపడి 95.63 వద్ద జీవనకాల కనిష్ఠాన్ని నమోదు చేసింది. మరోవైపు వరుసగా మూడు ట్రేడింగ్ సెషన్లలో మదుపర్ల సంపద సుమారు రూ.11 లక్షల కోట్లు ఆవిరైనట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఒక్క సోమవారమే దాదాపు రూ.6 లక్షల కోట్ల నష్టం నమోదైనట్లు సమాచారం. బంగారం కొనుగోళ్లు తగ్గించాలని, ఇంధనాన్ని పొదుపుగా వాడాలని ప్రధాని నరేంద్ర మోడీ చేసిన పిలుపు, అంతర్జాతీయ చమురు ధరల పెరుగుదల మార్కెట్లపై ప్రభావం చూపిస్తున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
