Mancherial | కుటుంబ హింస కేసు.. కోర్టు కీలక నిర్ణయం.. !!

  • వేధింపులు త‌ట్టుకోలేక భార్య ఆత్మ‌హ‌త్య‌
  • నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్ష

నెన్నెల, (ఆంధ్రప్రభ): కుటుంబ వేధింపులకు గురిచేస్తూ భార్యను ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో నేరం రుజువుకావడంతో, నిందితుడికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ మంచిర్యాల జిల్లా అదనపు సహాయ సెషన్స్ న్యాయస్థానం బుధవారం తీర్పు వెలువరించింది. దాంతో పాటు రూ.6 వేల జరిమానా విధించారు. అడిషనల్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి రామమోహన్ రెడ్డి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

నెన్నెల ఎస్సై ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం..
నెన్నెల మండలం ఆవడం గ్రామానికి చెందిన అసడి బాపు, తన భార్య స్వప్నను తరచూ అనుమానంతో శారీరకంగా, మానసికంగా వేధించేవాడు. 2014 అక్టోబర్ 11న స్వప్న తన పుట్టింటి నుంచి భర్త వద్దకు తిరిగి వచ్చింది. అదే రాత్రి బాపు ఆమెను అనుమానిస్తూ తీవ్రంగా కొట్టాడు. భర్త వేధింపులతో జీవితంపై విరక్తి చెందిన స్వప్న, అక్టోబర్ 12న ఉదయం 10 గంటల సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది.

తీవ్రంగా గాయపడిన ఆమెను కుటుంబ సభ్యులు మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం వరంగల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ స్వప్న మృతి చెందింది. దీనిపై మృతురాలి సోదరుడు గొర్రె తిరుపతి ఫిర్యాదు చేయగా, అప్పటి నెన్నెల ఎస్సై రమేష్ కేసు నమోదు చేశారు. తదనంతరం ఎస్సై తిరుపతి, ప్రస్తుత ఎస్సై ప్రసాద్ విచారణ పూర్తి చేసి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు.

ఈ కేసులో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ నంది రవీందర్ వాదనలు వినిపించగా, కోర్టు డ్యూటీ ఆఫీసర్ మార్యన్ రాజు, హెడ్ కానిస్టేబుళ్లు వెంకటేశ్వర్లు, ఎన్. గోవిందరావు సాక్ష్యాలను కోర్టు ముందుంచారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయస్థానం, నిందితుడు అసడి బాపుకు ఐదేళ్ల జైలు శిక్ష మరియు రూ.6 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.

సమర్థవంతంగా దర్యాప్తు చేసి నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన సీఐ హనుక్, ఎస్సై ప్రసాద్, లీగల్ టీమ్‌ను రామగుండం పోలీస్ కమిషనర్ (CP) అంబర్ కిషోర్ ఝా, మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్, బెల్లంపల్లి ఏసీపీ ఎ. రవికుమార్ అభినందించారు. మహిళలపై దాడులు, గృహ హింస, వేధింపుల కేసుల్లో పోలీసు శాఖ కఠినంగా వ్యవహరిస్తుందని, బాధితులకు న్యాయం అందేలా నిరంతరం కృషి చేస్తామని ఈ సందర్భంగా సీపీ తెలిపారు.

Leave a Reply