న్యూ ఢిల్లీ: దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో బీటెక్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్(బీఎస్), ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్ 2025 పరీక్ష ఫలితాలు నేడు విడుదల అయ్యాయి.
మే 18న జరిగిన ఈ పరీక్ష ఫలితాలను ఐఐటీ కాన్పుర్ సోమవారం విడుదల చేసింది. విద్యార్థులు పైన ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేసి రోల్ నంబర్, పుట్టినతేదీ, మొబైల్ నంబర్ ఎంటర్ చేసి స్కోర్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ‘అడ్వాన్స్‌డ్’లో అభ్యర్థి సాధించిన మార్కులతో కామన్ ర్యాంక్ లిస్ట్ (CRL), కేటగిరీ ర్యాంక్ లిస్ట్‌ను ఇవ్వనున్నారు.
ఈ లింక్ క్లిక్ చేసీ ఫలితాలు తెలుసుకోవచ్చు.
దేశ వ్యాప్తంగా దాదాపు 1.80 లక్షల మంది పరీక్ష జేఈఈ అడ్వాన్స్‌డ్ రాసినట్లు సమాచారం. వారిలో తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 40 వేల మంది ఉంటారని అంచనా. గతేడాది అడ్వాన్స్‌డ్‌లో రిజర్వేషన్ల ప్రకారం కటాఫ్ మార్కుల ఆధారంగా మొత్తం 48,248 మందికి జోసా కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు అర్హత కల్పించారు. వారు మాత్రమే ఐఐటీల్లో సీట్లు పొందేందుకు అర్హులు. గత విద్యాసంవత్సరం(2024-25) 23 ఐఐటీల్లో 17,760 సీట్లు అందుబాటులో ఉండగా.. మద్రాస్ ఐఐటీ సహా పలు ఐఐటీల్లో కొత్త కోర్సులు ప్రవేశ పెట్టడంతో ఈసారి సీట్లు స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది.
జూన్ 3వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా)-2025 కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.జాబ్ మార్కెట్ ట్రెండ్స్: 2030 నాటికి ఏ ఉద్యోగాలు పెరుగుతాయ్? ఏవి తగ్గుతాయ్?ఆరు విడతల్లో జోసా కౌన్సెలింగ్‌దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే ఇతర సాంకేతిక విద్యాసంస్థల్లో సీట్ల భర్తీకి ఈసారి ఆరు విడతల జోసా కౌన్సెలింగ్ జరగనుంది. ఐఐటీ కాన్పుర్ ఇటీవల కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా)-2025 వెబ్‌సైట్లో ఉంచింది.
గతేడాది ఐదు రౌండ్లలో కౌన్సెలింగ్ జరగ్గా.. ఈసారి ఆరు విడతల్లో నిర్వహించనున్నారు. జూన్ 3వ తేదీన రిజిస్ట్రేషన్లు, ఛాయిస్ ఫైలింగ్ చేపట్టనుండగా.. జూన్ 9, 11 తేదీల్లో మాక్ సీట్ అలాట్‌మెంట్ 1, 2; జూన్ 12న ఫైనల్ ఛాయిస్ లాకింగ్ జరగనున్నాయి. అనంతరం ఒకటో విడత జోసా కౌన్సిలింగ్: జూన్ 14; రెండో విడత: జూన్ 21; మూడో విడత: జూన్ 28; నాలుగో విడత: జులై 4 ; ఐదో విడత: జులై 10; ఆరో విడత: జులై 16 తేదీల్లో నిర్వహించనున్నారు.
ఇక ఈ ఏడాది మే 18న రెండు పేపర్లలో జరిగిన ఈ పరీక్షకు మొత్తం 1,80,422 మంది విద్యార్థులు హాజరు కాగా, వారిలో 54,378 మంది అభ్యర్థులు అర్హత సాధించినట్లు ఐఐటీ కాన్పూర్ ప్రకటించింది. ఐఐటీ ఢిల్లీ జోన్‌కు చెందిన రజిత్ గుప్తా కామన్ ర్యాంక్ లిస్ట్ (సీఆర్ఎల్)లో మొదటి ర్యాంకును కైవసం చేసుకున్నారు. రజిత్ మొత్తం 360 మార్కులకు గాను 332 మార్కులు సాధించి సత్తా చాటారు.
అమ్మాయిల విభాగంలో ఐఐటీ ఖరగ్‌పూర్ జోన్‌కు చెందిన దేవదత్తా మాఝీ ప్రథమ స్థానంలో నిలిచారు. ఆమె 312 మార్కులతో సీఆర్ఎల్‌లో 16వ ర్యాంకును దక్కించుకున్నారు. వీరితో పాటు వివిధ కేటగిరీలలో కూడా టాపర్లు తమ ప్రతిభను కనబరిచారు.
దేశవ్యాప్తంగా రెండు పేపర్లలో కలిపి అత్యధిక మార్కులు సాధించిన టాప్ టెన్ ర్యాంకర్లలో కొందరు వీరే:
* రజిత్ గుప్తా – 332 మార్కులు (ఐఐటీ ఢిల్లీ జోన్)
* సాక్షమ్ జిందాల్ – 332 మార్కులు (ఐఐటీ ఢిల్లీ జోన్)
* మాజిద్ ముజాహిద్ హుస్సేన్ – 330 మార్కులు (ఐఐటీ బాంబే జోన్)
* పార్థ్ మందార్ వార్తక్ – 327 మార్కులు (ఐఐటీ బాంబే జోన్)
* ఉజ్వల్ కేసరి – 324 మార్కులు (ఐఐటీ ఢిల్లీ జోన్)
* అక్షత్ కుమార్ చౌరాసియా – 321 మార్కులు (ఐఐటీ కాన్పూర్ జోన్)
* సాహిల్ ముఖేష్ దేవ్ – 321 మార్కులు (ఐఐటీ బాంబే జోన్)
* దేవేష్ పంకజ్ భయ్యా – 319 మార్కులు (ఐఐటీ ఢిల్లీ జోన్)
వివిధ ఐఐటీ జోన్ల నుంచి టాప్ 500 ర్యాంకుల్లో నిలిచిన అభ్యర్థుల వివరాలు కూడా విడుదలయ్యాయి. ఇవి ఆయా ప్రాంతాల్లోని విద్యా ప్రమాణాలు, పోటీ తీవ్రతను సూచిస్తున్నాయి. అలాగే, ప్రతి ఐఐటీ జోన్ నుంచి అత్యధిక ర్యాంకులు సాధించిన మహిళా అభ్యర్థుల జాబితాను కూడా విడుదల చేశారు. ఇది ఇంజనీరింగ్ రంగంలో మహిళల పెరుగుతున్న ప్రాతినిధ్యాన్ని, ప్రతిభను తెలియజేస్తోంది.
సబ్జెక్టుల వారీగా, మొత్తం మీద నిర్దేశిత కనీస కటాఫ్ మార్కులు సాధించిన అభ్యర్థులను మాత్రమే ర్యాంకుల జాబితాలో చేర్చినట్లు అధికారులు తెలిపారు. వివిధ కేటగిరీలకు సంబంధించిన కనీస కటాఫ్ మార్కుల వివరాలను కూడా విడుదల చేశారు.