పరిశ్రమలే జిల్లా అభివృద్ధికి బలమైన పునాది…

పరిశ్రమలే జిల్లా అభివృద్ధికి బలమైన పునాది…

ఎమ్మెస్ ఎం ఈలకు ప్రోత్సాహం…
పెంచితేనే తలసరి ఆదాయం పెరుగుదల…
కర్నూలులో 35 ఎంఓయూలు – పరిశ్రమల విస్తరణకు వేగం…
రూ.68.88 లక్షల ప్రోత్సాహకాలు విడుదల…
పారిశ్రామిక వృద్ధికి ఊతం…
మహిళలు, ఎస్సీ-ఎస్టీలకు ప్రత్యేక ప్రాధాన్యం…
క్లస్టర్ పాలసీ అమలు…

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లా సమగ్ర అభివృద్ధికి పరిశ్రమలే ప్రధాన ఆధారమని, తలసరి ఆదాయాన్ని పెంచేందుకు పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేయడం అత్యవసరమని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి స్పష్టం చేశారు. బుధవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన జిల్లా పరిశ్రమలు, ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశంలో ఆమె కీలక మార్గదర్శకాలు జారీ చేశారు.

పరిశ్రమల విస్తరణతోనే ఆర్థిక పురోగతి జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అనుకూల వాతావరణాన్ని సృష్టించడం ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, అదే తలసరి ఆదాయ పెరుగుదలకు దారితీస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎం ఎస్ ఎం ఈలు) గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలుగా నిలుస్తాయని, వాటి ప్రోత్సాహం అత్యంత కీలకమని వివరించారు.

క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌కు ప్రాధాన్యం..

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (ఏపీ సి డి పి) ద్వారా పారిశ్రామిక పార్కుల ఏర్పాటు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. రూ.1 కోటి నుంచి రూ.5 కోట్ల ప్రాజెక్టులకు 80% వరకు సబ్సిడీ, రూ.5 నుంచి రూ.10 కోట్ల ప్రాజెక్టులకు 70% వరకు ఆర్థిక సాయం, అందుబాటులో ఉండగా, మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక కేటగిరీలో 90% వరకు సబ్సిడీ ఇవ్వడం కీలక నిర్ణయంగా భావించవచ్చు.

ఈ విధానాలు అమలు అయితే జిల్లాలో పారిశ్రామిక వృద్ధికి బలమైన పునాది ఏర్పడుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. పరిశ్రమల స్థాపనలో పురోగతి జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 35 ఎంఓయూలు కుదిరాయి. వాటిలో: 11 యూనిట్లు నిర్మాణ దశలో ఉన్నాయి.15 యూనిట్లు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. ఇది పరిశ్రమల రంగంలో ఆశాజనక పరిణామంగా భావించబడుతోంది. అయితే, ఈ యూనిట్ల పూర్తి అమలు వేగవంతం కావాల్సిన అవసరం ఉందని కలెక్టర్ స్పష్టం చేశారు.

రూ. 68.88 లక్షల ప్రోత్సాహకాలు – పారిశ్రామిక వృద్ధికి ఊతం..

జిల్లాలో పరిశ్రమలకు ప్రోత్సాహంగా మొత్తం 12 సంస్థలకు రూ.68,88,136లు విడుదల చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ కింద 4 సంస్థలకు రూ.49.91 లక్షలు పవర్ కాస్ట్ రీయింబర్స్‌మెంట్ కింద 8 సంస్థలకు రూ. 18.96 లక్షలు, ఈ ప్రోత్సాహకాలు చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఊతమివ్వడమే కాకుండా, కొత్త పారిశ్రామికవేత్తలను ఆకర్షించే అవకాశముందని విశ్లేషకులు అంటున్నారు.

జిల్లా సమస్యలు – పరిశ్రమలే పరిష్కారం..

కర్నూలు జిల్లాలో నీటి వనరుల కొరత, అక్షరాస్యత తక్కువగా ఉండటం వంటి సవాళ్లు అభివృద్ధికి అడ్డంకిగా ఉన్నాయని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ పరిస్థితులను అధిగమించేందుకు పరిశ్రమల విస్తరణ కీలక పాత్ర పోషిస్తుందని అభిప్రాయపడ్డారు.

పి.యం విశ్వకర్మ పథకానికి ప్రత్యేక దృష్టి..

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పి.యం విశ్వకర్మ పథకంలో పురోగతి సాధించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సంప్రదాయ వృత్తుల అభివృద్ధి ద్వారా గ్రామీణ ఉపాధి పెంపుకు ఈ పథకం ఉపయోగపడుతుందని తెలిపారు.

పెండింగ్ ప్రాజెక్టులకు వేగం అవసరం..

పెండింగ్‌లో ఉన్న పరిశ్రమల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత శాఖలను కలెక్టర్ ఆదేశించారు. పరిశ్రమలు ర్తిస్థాయిలో అమలు అయితేనే ఉపాధి అవకాశాలు పెరిగి, జిల్లాలో ఆర్థిక చైతన్యం వస్తుందని స్పష్టం చేశారు. మొత్తంగా కర్నూలు జిల్లాలో పరిశ్రమల అభివృద్ధి దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సానుకూలంగా ఉన్నప్పటికీ, వాటి అమలులో వేగం కీలకం. ముఖ్యంగా ఏం ఎస్ ఎం ఈ రంగాన్ని బలోపేతం చేయడం ద్వారా గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు పెరగడం, వలసలు తగ్గడం, తలసరి ఆదాయం పెరగడం వంటి ప్రయోజనాలు పొందవచ్చు.

మొత్తం మీద పరిశ్రమల అభివృద్ధి ద్వారా కర్నూలు జిల్లా ఆర్థికంగా బలోపేతం కావచ్చని స్పష్టమవుతోంది. ప్రభుత్వ ప్రోత్సాహకాలు, అధికారుల సమన్వయం, పారిశ్రామికవేత్తల చొరవ కలిసి వస్తే జిల్లాలో పారిశ్రామిక విప్లవానికి నాంది పలికే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply