అచ్చంపేటలో సాకారమవుతున్న పేదల ఇంటి కల

పేదల ఇంటి కలలకు కాంగ్రెస్ సర్కార్ బాటలు

అచ్చంపేటలో శరవేగంగా గృహ నిర్మాణాలు.. రెండో విడతకు సన్నాహాలు
తొలి విడతలో 4,715 ఇళ్ల కేటాయింపు.. 4,022 మందికి మంజూరు
నిర్మాణ దశల వారీగా బిల్లుల చెల్లింపులకు చర్యలు

అచ్చంపేట, ఆంధ్రప్రభ: తెలంగాణలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం పేదల సొంతింటి కలలను సాకారం చేయాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం అచ్చంపేట నియోజకవర్గంలో వేగంగా అమలవుతోంది. గ్రామసభల ద్వారా అర్హులను పారదర్శకంగా ఎంపిక చేసి, తొలి విడతలో వేలాది గృహాలను మంజూరు చేయడంతో పేద కుటుంబాల్లో ఆనందం నెలకొంది. ప్రభుత్వం ఒక్కో ఇంటికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించడంతో పాటు నిర్మాణ దశల వారీగా బిల్లులు విడుదల చేస్తుండటంతో గృహ నిర్మాణ పనులు ఊపందుకున్నాయి.

4,715 ఇళ్ల కేటాయింపు.. 4,022 మందికి మంజూరు
అచ్చంపేట నియోజకవర్గానికి తొలి విడతలో మొత్తం 4,715 గృహాలు కేటాయించగా, అందులో 4,022 మంది లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు చేశారు. మండలాల వారీగా అచ్చంపేట మండలానికి 638, అచ్చంపేట మున్సిపాలిటీకి 220, అమ్రాబాద్‌కు 607, బలమూరుకు 591, చారగొండకు 297, లింగాలకు 686, పదరకు 407, ఉప్పునుంతలకు 501, వంగూరుకు 768 గృహాలు కేటాయించారు.

నిర్మాణాల్లో వేగం
మంజూరైన ఇళ్లలో 3,508 గృహాలకు మార్కింగ్ పూర్తికాగా, 964 ఇళ్లకు ఇంకా మార్కింగ్ జరగాల్సి ఉంది. ప్రస్తుతం 934 గృహాలు బేస్‌మెంట్ దశలో, 398 గృహాలు రూఫ్ లెవల్‌లో, 1,001 గృహాలు రూఫ్ కాంక్రీట్ దశలో ఉన్నాయి. మరో 292 గృహాలు పూర్తి కావడానికి చివరి దశలో ఉన్నాయి. మొత్తంగా 2,625 గృహాలు వివిధ దశల్లో నిర్మాణంలో ఉండగా, మార్కింగ్ పూర్తయిన 433 గృహాల పనులు ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది.

వేగంగా బిల్లుల చెల్లింపులు
గృహ నిర్మాణాలకు సంబంధించి దశల వారీగా బిల్లుల మంజూరు ప్రక్రియ కొనసాగుతోంది. క్షేత్రస్థాయిలో హౌసింగ్ అధికారులు ఇళ్ల పురోగతిని పరిశీలించి, ప్రభుత్వ నిబంధనల మేరకు బిల్లులు విడుదల చేస్తున్నారు. బిల్లుల చెల్లింపుల్లో జాప్యం లేకుండా చూడాలని ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ప్రత్యేకంగా ఆదేశాలు ఇవ్వడంతో లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు వేగంగా జమ అవుతున్నాయని అధికారులు చెబుతున్నారు.

ఐదు మండలాల్లో నిర్మాణ జోరు
అచ్చంపేట, అమ్రాబాద్, బలమూరు, లింగాల, ఉప్పునుంతల మండలాల్లో గృహ నిర్మాణాలు శరవేగంగా కొనసాగుతున్నాయి. ప్రభుత్వం నుంచి ఆర్థిక సహకారం అందుతుండటంతో లబ్ధిదారులు తమ కలల ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసుకునేందుకు ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు.

రెండో విడతకు శ్రీకారం
ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత అమలుకు ప్రభుత్వం ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. అర్హులైన నిరుపేదలను గుర్తించి పారదర్శకంగా ఎంపిక చేసే ప్రక్రియ కొనసాగుతోంది. గూడు లేని ప్రతి పేద కుటుంబానికి ఇల్లు అందించాలన్న లక్ష్యంతో అధికారులు గ్రామాల వారీగా దరఖాస్తులను పరిశీలిస్తున్నారు.

‘గూడు లేని కుటుంబం ఉండకూడదు’.. ఎమ్మెల్యే వంశీకృష్ణ
నియోజకవర్గ పరిధిలో గూడు లేని ప్రతి నిరుపేద కుటుంబానికి ఇల్లు మంజూరు కావాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ స్పష్టం చేసినట్లు సమాచారం. ఆయన సూచనల మేరకు అధికారులు అర్హుల ఎంపికను పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు ముమ్మరం చేశారు.

Leave a Reply