Grain Stocks | కన్నీటి పర్యంతమవుతున్న రైతన్నలు

Grain Stocks | కన్నీటి పర్యంతమవుతున్న రైతన్నలు
అచ్చంపేట మార్కెట్లో నత్తనడకన కొనుగోళ్లు
Grain Stocks | అచ్చంపేట ఆంధ్రప్రభ : నాగర్ కర్నూల్ జిల్లా, అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోళ్లు, రవాణా ప్రక్రియ పూర్తిగా నత్తనడకన సాగుతుండటంతో రైతన్నలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మార్కెట్లో రోజురోజుకూ ధాన్యం గుట్టలు పెరుగుతుండగా, సరైన రవాణా సదుపాయాలు లేక వేలాది క్వింటాళ్ల పంట గురువారం నాడు అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షానికి మొక్కజొన్న, వేరుశనగ ధాన్యం వర్షార్పణమయింది. అధికారుల నిర్లక్ష్యం, రవాణా కాంట్రాక్టర్ల ఉదాసీనత కారణంగానే ఈ దుస్థితి ఏర్పడిందని రైతులు మండిపడుతున్నారు. గురువారం రాత్రి కురిసిన భారీ వర్షాలతో మార్కెట్ యార్డులో ఓపెన్ ప్లాట్‌ఫారాలపై నిల్వ ఉంచిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. తగిన తార్పాలిన్లు లేకపోవడం, కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించకపోవడంతో రైతుల కష్టార్జిత పంట నీటిపాలు అవుతోంది. తడిసిన ధాన్యానికి రంగు మారడంతో పాటు మొలకలు వచ్చే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
యార్డులో భారీగా ధాన్యం నిల్వలు
ప్రస్తుతం మార్కెట్ యార్డులో దాదాపు 125 లారీలకు సరిపడా ధాన్యం నిల్వలు పేరుకుపోయినట్లు సమాచారం. రోజూ భారీగా ధాన్యం వస్తుండగా, కేవలం 2 నుంచి 3 లారీల్లో మాత్రమే మిల్లులకు తరలింపు జరుగుతోందని రైతులు చెబుతున్నారు. దీంతో మార్కెట్ మొత్తం ధాన్యపు గుట్టలతో కిక్కిరిసిపోయింది. “వందల లారీల ధాన్యం ఉండగా రోజుకు రెండు మూడు లారీలు మాత్రమే తీస్తే మార్కెట్ ఎప్పుడు ఖాళీ అవుతుంది? మరోసారి వర్షం వస్తే మా పంట పరిస్థితి ఏమవుతుంది?” అంటూ రైతన్నలు కన్నీళ్ల పర్యంతం అవుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ధాన్యం కొనుగోళ్లు, రవాణా ప్రక్రియను వేగవంతం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
