Devotional : గోల్డెన్ టెంపుల్‌లో వైభవంగా శ్రీలక్ష్మి నరసింహ స్వామి కల్యాణోత్సవం

హైదరాబాద్, : హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్‌లో పవిత్రమైన శ్రీ నరసింహ జయంతి ఉత్సవాలు ఆదివారం అత్యంత భక్తిశ్రద్ధలతో, మహా వైభవంగా నిర్వహించారు.ఈ ఉత్సవాల్లో ప్రధానంగా స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి మూలావర్’ (మూలవారు విగ్రహానికి) మహా అభిషేకం, శ్రీ నరసింహ హోమం, శ్రీదేవి భూదేవి సమేత నరసింహ స్వామివారి కల్యాణోత్సవం, ఉత్సవ విగ్రహానికి 108 కలశాలతో మహాఅభిషేకం నిర్వహించారు.

అలాగే ఉంజల్ సేవ, పల్లకీ ఉత్సవంతో పాటు ప్రత్యేక ప్రవచనం వంటి వైభవోపేత కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. బ్రహ్మ ముహూర్తంలో ఉదయం 5:10 గంటలకు స్వయంభూ మూలవర్’కి మహా అభిషేకం జరిగింది. ఉదయం 9:00 గంటలకు వేద మంత్రోచ్ఛారణల మధ్య శాంతి, ఐశ్వర్యాల కొరకు శ్రీ నరసింహ హోమం నిర్వహించబడింది.

అనంతరం మహాపూర్ణాహుతితో ముగిసి, ఉదయం 11:00 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత నరసింహ స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. అనంతరం స్వామివారికి నూతన వస్త్రాలు, దివ్యాభరణాలు మరియు పుష్పాలతో అద్భుతమైన అలంకారం చేయబడింది. తర్వాత కళ్యాణ విందు భోజన ప్రసాదం భక్తులకు పంపిణీ చేయబడింది.

సాయంత్రం, ఉత్సవ విగ్రహానికి 108 కలశాలతో మహా అభిషేకం జరగగా, పంచామృతం, పంచగవ్య, ఫలరసాలు, ఔషధాలు, నవరత్నాలు, దేశంలోని పవిత్ర నదుల నుండి భక్తులు సేకరించిన పవిత్ర జలాలతో అభిషేకం చేయడం విశేషం.

ఈ సందర్భంగా భక్తులు నిర్వహించిన హరినామ సంకీర్తన ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత మానసికంగా అలంకరించింది.

ఈ సందర్భంగా హరేకృష్ణ మూవ్ మెంట్, హైదరాబాద్ అధ్యక్షులు సత్య గౌరచంద్ర దాస్ ప్రభుజీ ప్రత్యేక ప్రవచనం అందించారు.

“భక్త ప్రహ్లాదుడిని రక్షించేందుకు భగవాన్ శ్రీకృష్ణుడు, నరసింహ స్వరూపంగా అవతరించారు. స్తంభం నుండి అవతరించిన అర్ధ సింహ–అర్ధ మానవ స్వరూపంలో, ఆయన భక్తులైన బ్రహ్మ మరియు ప్రహ్లాదుని మాటలు నిజం చేశారు. ఈ దివ్య అవతారాన్ని ‘నరసింహ జయంతి’గా చతుర్దశి తిథినాడు జరుపుకుంటాం. ఈ రోజు నరసింహ క్షేత్రాలను సందర్శించడం వల్ల భక్తులు అపారమైన ఆధ్యాత్మిక ఫలాలను పొందగలుగుతారు.”

ఆనంతరం స్వయంభూ స్వామివారి ప్రత్యేక దర్శనం, యోగ నరసింహ స్వామిగా ప్రత్యేక అలంకారం, ఉంజల్ సేవ భక్తులకు అపూర్వమైన దివ్యానుభూతిని అందించాయి. చివరిగా చప్పన్ భోగ్ నైవేద్యం, మహా మంగళహారతి, పుష్పాంజలి, పల్లకీ ఉత్సవం, రాత్రి ప్రసాద వితరణతో కార్యక్రమాలు ముగించబడ్డాయి.

ఈ సందర్భంగా “అభయం” అనే ప్రత్యేక మార్గదర్శిత మంత్ర జప కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఇందులో పిల్లలు, తల్లిదండ్రులు కలిసి నరసింహ మంత్రాలను జపించడం ద్వారా భయం, ఆత్మవిశ్వాస లోపం, ఆందోళనలను తొలగించుకుని దివ్య ధైర్యాన్ని పొందే అవకాశం కలిగింది.

ఈ మహోత్సవాలలో నగరంలోని అన్ని ప్రాంతాల నుండి వేలాదిమంది భక్తులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రసాద వితరణ, భద్రత, సౌకర్యాల నిర్వహణ కోసం విశిష్ట ఏర్పాట్లు చేపట్టబడ్డాయి.

Leave a Reply