cyber crime | జోరుగా ఫేక్ ఐపీఎల్ టికెట్ల విక్రయాలు

cyber crime | జోరుగా ఫేక్ ఐపీఎల్ టికెట్ల విక్రయాలు
cyber crime | మ్యాచ్ టికెట్లు, ఆన్‌లైన్ స్ట్రీమింగ్ పేరుతో బురిడీ
లక్షలాది రూపాయలను దోచుకుంటున్న కేటుగాళ్లు
ఓటీపీ, బ్యాంక్ వివరాలు తీసుకుని ఖాతాలు ఖాళీ
సోషల్ మీడియాలో సెలబ్రిటీల పేర్లతో నకిలీ ప్రకటనలు
cyber crime | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : ఐపీఎల్ సీజన్ వచ్చిందంటే ఎక్కడలేని సందడి నెలకొంటుంది. పొట్టి ఫార్మట్‌లో జరిగే మ్యాచులను చూడటానికి అభిమానులు ఎంతో ఆసక్తి చూపుతుంటారు. తమ దేశ, విదేశీ అభిమాన క్రికెటర్లు సిక్సులు, ఫోర్లు కొడుతుంటే ఫ్యాన్స్ ఉర్రూతలూగుతుంటారు. అయితే ఐపీఎల్ మ్యాచులను ప్రత్యక్షంగా స్టేడియంలో చూడటానికి ఇష్టపడుతుంటారు. చాలామందికి టికెట్లు దొరకక ఇబ్బందులు పడుతుంటారు. ఇలాంటి సమయంలోనే సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అభిమానుల అవసరాలను అదనుగా చేసుకొని మోసాలకు పాల్పడుతున్నారు. మ్యాచ్ టికెట్లు, ఆన్‌లైన్ స్ట్రీమింగ్ పేరుతో ఫ్యాన్స్‌ను బురిడీ కొట్టిస్తూ లక్షలాది రూపాయలు దోచేస్తున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ పేరుతో ఫేక్ బెట్టింగ్ యాప్స్, టికెట్ బుకింగ్ లింకులు, గిఫ్ట్ ఆఫర్లు, ఫ్రీ స్ట్రీమింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. “ఫ్రీ IPL టికెట్స్” అంటూ ఫేక్ వెబ్‌సైట్లు, మ్యాచ్ ప్రిడిక్షన్ పేరుతో బెట్టింగ్ యాప్స్.. వాట్సాప్, టెలిగ్రామ్ లింకుల ద్వారా డబ్బుల దోపిడీకి దిగుతున్నారు. ఓటీపీ, బ్యాంక్ వివరాలు తీసుకుని ఖాతాలు ఖాళీ చేయడం, సోషల్ మీడియాలో సెలబ్రిటీల పేర్లతో నకిలీ ప్రకటనలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు.
ఐపీఎల్ అభిమానుల బలహీనతలను ఆసరాగా చేసుకుని, వారిని మోసం చేసేందుకు 1,000కి పైగా నకిలీ వెబ్‌సైట్లను సృష్టించారు. టికెట్లు, ఉచిత స్ట్రీమింగ్ పేరుతో ఈ మోసాలకు పాల్పడుతున్నారని సైబర్ సెక్యూరిటీ సంస్థ క్లౌడ్‌సెక్ తన నివేదికలో వెల్లడించింది. ఈ నకిలీ వెబ్‌సైట్లను అచ్చం అసలు ప్లాట్‌ఫామ్‌ల మాదిరిగానే రూపొందిస్తున్నారు. అధికారిక లోగోలు, లేఅవుట్‌లు, బుకింగ్ విధానాలను కాపీ కొట్టి, అభిమానులను సులభంగా నమ్మిస్తున్నారు. సీట్లు ఎంచుకోమని, వ్యక్తిగత వివరాలు నమోదు చేయమని చెప్పి.. యూపీఐ (UPI), కార్డులు లేదా క్యూఆర్ కోడ్‌ల ద్వారా డబ్బులు వసూలు చేస్తున్నారు. డబ్బులు చెల్లించాక, కొందరికి నకిలీ బుకింగ్ ఐడీ, క్యూఆర్ కోడ్‌లతో కూడిన ఫేక్ పీడీఎఫ్ టికెట్లను కూడా పంపిస్తున్నారు. తీరా స్టేడియం గేట్ల వద్దకు వెళ్లాక గానీ అది మోసమని బాధితులకు తెలియడం లేదు.
సైబర్ పోలీసులు చెబుతున్న సూచనలు:
తెలియని లింకులను క్లిక్ చేయొద్దని సైబర్ పోలీసులు సూచిస్తున్నారు. అధికారిక యాప్స్ ద్వారానే ఐపీఎల్ టికెట్లు బుక్ చేసుకోవాలంటున్నారు. ఓటీపీ, బ్యాంక్ వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దని చెబుతున్నారు. అనుమానాస్పద యాప్స్ డౌన్‌లోడ్ చేయొద్దని, మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.
