గోరక్షా చట్టాలను కఠినంగా అమలు చేయాలి

గోరక్షా చట్టాలను కఠినంగా అమలు చేయాలి

  • సీఐ, ఎస్సైలకు విశ్వహిందూ పరిషత్
  • బజరంగ్ దళ్ వినతిపత్రం

మక్తల్, ఆంధ్రప్రభ : బక్రీద్ పండుగ సందర్భంగా గోరక్షా చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని కోరుతూ విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ నాయకులు మక్తల్ సీఐ రామ్‌లాల్, ఎస్సై వై. భాగ్యలక్ష్మి రెడ్డికి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోమాతను సకల దేవతా స్వరూపంగా భావిస్తూ వేదకాలం నుంచి ఆరాధిస్తున్నామని పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ, పర్యావరణ పరిరక్షణ, వ్యవసాయం, మానవ ఆరోగ్య రక్షణలో గోమాత కీలక పాత్ర పోషిస్తోందన్నారు.

అయితే ప్రస్తుతం గోవులను విచ్చలవిడిగా వధించి మాంసాహారంగా వినియోగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వేలాది టన్నుల గోమాంసాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తున్నారని ఆరోపించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1977లో అమలులోకి తీసుకువచ్చిన గోరక్షా చట్టం ప్రస్తుతం తెలంగాణలో అమల్లో ఉన్నప్పటికీ, రాష్ట్రంలో చట్టవిరుద్ధంగా గోవధ కొనసాగుతోందని పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 48లో గోరక్షకు సంబంధించిన నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని సమర్థవంతంగా అమలు చేయడం లేదని విమర్శించారు.

బక్రీద్ సందర్భంగా గోవధ మరింత పెరుగుతోందని, చట్ట అమలు యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. గోవధశాలలను తక్షణమే మూసివేయాలని, ఆక్రమణలో ఉన్న గోచర భూములను విముక్తి చేయాలని, గుర్తింపు పొందిన గోశాలలకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.

ప్రతి జిల్లాలో ప్రభుత్వ ఆధ్వర్యంలో గోశాలలు ఏర్పాటు చేయాలని, దేవాదాయ శాఖ పరిధిలోని దేవాలయాల్లో గోవులను పెంచాలని సూచించారు. గో ఆధారిత వ్యవసాయం చేస్తున్న రైతులు, గోపోషకులకు ప్రోత్సాహకాలు అందించాలని కోరారు.

అక్రమంగా తరలిస్తున్న గోవులను అడ్డుకునేందుకు ప్రధాన నగరాలు, పట్టణాల శివార్లలో ప్రత్యేక పోలీస్ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి, గో సంతతిని రక్షించడంతో పాటు అక్రమ రవాణా వాహనాలను సీజ్ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ నాయకులు భాస్కర్ రెడ్డి, కార్యదర్శి మల్లికార్జునరావు, జుట్ల హనుమంతు, జిల్లా బజరంగ్ దళ్ కో-కన్వీనర్ భీమేష్, ప్రఖండ సంయోజక్ రాహుల్, గోరక్ష సంయోజక్ అనిల్, శివ, లింగం, రమేష్, నరేష్, శంకర్, రామాంజనేయులు, నవీన్, బజరంగ్ దళ్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply