- అప్పు తీర్చమని ఎరువుల వ్యాపారి ఒత్తిడి
- కళ్లం నుంచి మిర్చి బస్తాలు తీసుకెళ్లిన వైనం
- మనస్థాపానికి గురై పురుగుల మందు తాగిన రైతు
వాజేడు, ఆంధ్రప్రభ : ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని ధర్మవరం గ్రామానికి చెందిన బొగటా నరసింహారావు అనే మిర్చి రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పురుగుల మందు తాగిన ఆయన అస్వస్థతకు గురయ్యాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఏటూరు నాగారం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు వైద్యులు తెలిపారు.
ఆత్మహత్యాయత్నానికి కారణం ఇదే…
రైతు నరసింహారావు రెండు ఎకరాలలో మిర్చిపంట సాగు చేశాడు. ఇందుకు గాను అదే గ్రామానికి చెందిన బుల్లె ప్రశాంత్ అనే ఎరువుల వ్యాపారి వద్ద రూ.90,000 అప్పుగా తీసుకున్నాడు. మూడేళ్లుగా మిర్చి దిగుబడి లేకపోవడం, ఈ ఏడాది మిర్చికి ధర లేకపోవడంతో అప్పు తీర్చలేకపోయాడు. వ్యాపారి ఒత్తిడి భరించలేక 15 బస్తాల మిర్చి ఇస్తానని, మిగతావి మరుసటి ఏడాది ఇస్తానని రైతు చెప్పాడు. అయితే ఆ వ్యాపారి వినకుండా కళ్లంలో ఉన్న మిర్చి బస్తాలను ట్రాక్టర్‌పై ఎక్కించుకుని తీసుకువెళ్లిపోయాడు. పంట మొత్తం వ్యాపారి తీసుకెళ్లడంతో మిగిలిన వారికి అప్పులు తీర్చడం కష్టమని రైతు నరసింహారావు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.