AP | సినీ ఫక్కీలో పట్టపగలే చైన్ స్నాచింగ్…

పాయకాపురం (విజ‌య‌వాడ‌), మార్చి17(ఆంధ్రప్రభ) : సినిమాలో చూపించినట్లుగా పట్టపగలే ఓ ఆగంతకుడు చైన్ స్నాచింగ్ చేశాడు. ఓ ఫ్యాన్సీ షాపున‌కు వచ్చి దర్జాగా కూల్ డ్రింక్ తాగి, డబ్బులను ఫోన్ పే చేస్తానని బిల్డప్ ఇచ్చి, ఫోన్ పే పనిచేయడం లేదా అని సదరు మహిళను పలకరిస్తూ… షాపులో ఉన్న మహిళ వద్దకు వెళ్లి మెడలోని నాలుగు కాసుల బంగారు చైన్ తెంచుకుని పరారయ్యాడు. సినీ ఫక్కీలో జరిగిన ఈ సంఘటన అజిత్ సింగ్ నగర్ తోట వారి వీధిలో సోమవారం చోటుచేసుకొంది.

వివరాలలోకి వెళితే… అజిత్ సింగ్ నగర్ తోట వారి వీధిలో నివాసఉంటున్న గీతా భవాని, శ్రీ సాయి విగ్నేశ్వర స్టీల్ అండ్ ఫ్యాన్సీ స్టోర్ నడుపుతున్నది. ఎప్పటిలాగే ఫ్యాన్సీ షాపును ఓపెన్ చేసి ఉండగా సుమారు ముప్పై నుండి ముప్పై ఐదు సంవత్సరాల వయస్సు కలిగిన ఓ ఆగంతకుడు షాపు వద్దకు వచ్చి తొలుత కూల్ డ్రింక్ తీసుకొని ఫోన్ పే ద్వారా నగదు చెల్లింపులు చేశాడు. మరి కొన్ని సరుకులు తీసుకొని ఫోన్ పే చేస్తుండగా అది పనిచేయడం లేదని షాపు యజమానితో అతడు చెప్పాడు. ఇలా ఐతే తనకు సరుకులు అప్పుగా ఇవ్వాలని షాపు యజమానితో చెప్పాడు. సదరు షాపు యజమాని ప‌క్కనే ఏ.టీ.ఎమ్ ఉందని, అక్కడి నుండి డబ్బులు తీసుకొనిరా… అప్పుడే సరుకులు ఇస్తానని, అప్పు ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది.

అతడిపై అనుమానం వచ్చిన షాపు యజమాని, అంతకుముందే సరుకులు తీసుకొని రావడానికి మార్కెట్టుకు వెళ్లిన తన భర్తకు ఆమె ఫోన్ చేసి ఎక్కడున్నావని అడుగగా, సింగ్ నగర్ ప్రాంతంలో ఉన్నానని చెప్పాడు. దీంతో గీతా భవాని హమ్మయ్య అని ఊపిరి పీల్చుకొంటూ భర్త రాక కోసం చూస్తూ ఉంది. ఇంతలోనే ఆగంతకుడు షాపులోకి చొరబడి, ఆమె మెడలో ఉన్న నాలుగు కాసుల బంగారు చైన్ తెంచుకుని అక్కడ నుండి పరారయ్యాడు. వెంటనే ఆమె అజిత్ సింగ్ నగర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, రంగంలోకి దిగిన ఏసీపీ, సిఐ, సంఘటన‌ స్థలానికి చేరుకుని బాధిత మహిళ నుండి వివరాలు తెలుసుకొన్నారు. క్లూస్ టీమ్ పోలీసులు పక్కనే ఉన్న సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. ఐతే పట్టపగలే చైన్స్ స్నాచింగ్ జరగడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *