Amaravati-Health-Hub : ఇక అమరావతి జీహెచ్​డీ Andhra Prabha Top News

Amaravati-Health-Hub : ఇక అమరావతి జీహెచ్​డీ Andhra Prabha Top News

  • గ్లోబల్ హెల్త్ హబ్‌గా తీర్చిదిద్దుతాం
  • 600 పడకలు, 32 ప్రత్యేక విభాగాలతో అత్యాధునిక ఆసుపత్రి
  • సంజీవని ప్రాజెక్టుతో ఇంటింటికీ ఆరోగ్య సేవలు
  • ప్రతి కుటుంబానికి రూ.2.5 లక్షల వరకు ఉచిత వైద్యం
  • ఆరోగ్యకర జీవనశైలిపై సీఎం కీలక సూచనలు
  • వైద్య రంగంలో లలితా ఆసుపత్రి కొత్త మైలురాయి
  • గుంటూరులో లలితా ఆసుపత్రి ప్రారంభం

( గుంటూరు బ్యూరో , ఆంధ్రప్రభ )

Amaravati-Health-Hub : గుంటూరులో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన లలితా ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రసంగించారు. దశాబ్దాలుగా వైద్య రంగంలో విశ్వసనీయ సేవలు అందిస్తున్న లలితా గ్రూప్ గుంటూరులో ఏడు ఎకరాల విస్తీర్ణంలో 600 పడకలతో, 32 ప్రత్యేక విభాగాలతో కూడిన అత్యాధునిక ఆసుపత్రిని ఏర్పాటు చేయడం సంతోషకరమని పేర్కొన్నారు. కార్డియాలజీ, న్యూరాలజీ, జాయింట్ రీప్లేస్‌మెంట్ వంటి అత్యున్నత వైద్య సేవలు ఒకే కేంద్రంలో అందుబాటులో ఉండటం విశేషమన్నారు. దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా అత్యాధునిక ఎంఆర్ఐ స్కానింగ్ సదుపాయాన్ని ఈ ఆసుపత్రి అందుబాటులోకి తీసుకువచ్చిందని తెలిపారు.

1995లో హైదరాబాద్‌లో నిమ్స్, ఉస్మానియా, గాంధీ వంటి ఆసుపత్రులను ఆధారంగా చేసుకుని హెల్త్ టూరిజాన్ని ప్రోత్సహించామని, ఫలితంగా దేశవ్యాప్తంగా ప్రజలు చికిత్స కోసం హైదరాబాద్‌కు వస్తున్నారని గుర్తుచేశారు. అదే విధంగా రాబోయే రోజుల్లో ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి రోగులు అమరావతికి వచ్చి వైద్యం పొందే స్థాయికి రాష్ట్రాన్ని తీసుకెళ్తామని చెప్పారు. ఇప్పటికే 15 లక్షల మందికి వైద్య సేవలు అందించిన లలితా ఆసుపత్రి విశ్వసనీయత, నాణ్యతకు నిదర్శనమని, ఒక బ్రాండ్‌ను విలువలతో నిర్మిస్తే దానికి తిరుగుండదని వ్యాఖ్యానించారు.

ఆరోగ్యానికి మించిన ఆస్తి మరొకటి లేదని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నవారే నిజమైన ధనవంతులని సీఎం అన్నారు. వేల కోట్ల సంపద, విలాసవంతమైన భవనాలు ఉన్నా ఆరోగ్యం లేకపోతే వాటికి విలువ లేదని పేర్కొన్నారు. ఆరోగ్యవంతులైన పౌరులే సంపన్న దేశ నిర్మాణానికి పునాది అని స్పష్టం చేశారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న ‘సంజీవని’ ప్రాజెక్టు పూర్తి స్థాయి ఆరోగ్య సంరక్షణ కార్యక్రమమని తెలిపారు. డిజిటల్ హెల్త్ రికార్డులు, ప్రపంచ స్థాయి వైద్య పరిజ్ఞానం, ఉత్తమ విధానాలను ప్రజల ఇంటి వద్దకే తీసుకువచ్చేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించామని చెప్పారు. ప్రిడిక్టివ్, ప్రివెంటివ్, క్యూరేటివ్ విధానాలతో ఆరోగ్య సేవలను అందిస్తున్నామని, 42 రకాల వైద్య పరీక్షలను ప్రజల ఇంటి వద్దే నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఏ మందులు తీసుకోవాలి, ఎప్పుడు ఆసుపత్రికి వెళ్లాలి వంటి సూచనలు కూడా సంజీవని ద్వారా అందుతాయని వివరించారు.

యూనివర్సల్ హెల్త్ పాలసీ ద్వారా ప్రతి కుటుంబానికి రూ.2.5 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామని సీఎం తెలిపారు. అయితే ప్రజలు ఆసుపత్రులకు వెళ్లాల్సిన పరిస్థితి రాకుండా ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు. తినే ఆహారం, పరిసరాలు, ఆలోచనా విధానం ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని, మంచి అలవాట్లు, సమతుల్య ఆహారం, వ్యాయామం ఆరోగ్యానికి అత్యంత అవసరమని చెప్పారు. యోగా, ప్రాణాయామానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు.

“ఫుడ్ ఈజ్ మెడిసిన్ – కిచెన్ ఈజ్ ఫార్మసీ” అనే భావనను ప్రజలు గుర్తుంచుకోవాలని, మనం తీసుకునే ఆహారమే మన ఆరోగ్యాన్ని కాపాడుతుందని సీఎం అన్నారు. ఒకప్పుడు ఎరువులు లేకుండానే పంటలు పండేవని, ప్రస్తుతం అధికంగా రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడటం వల్ల ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో నాసిరకం మద్యం కారణంగా అనేక మంది ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ప్రజల జీవితాలతో చెలగాటమాడారని విమర్శించారు. లలితా ఆసుపత్రి భవిష్యత్తులో రాష్ట్రానికి మాత్రమే కాకుండా దేశానికి కూడా ఒక ల్యాండ్‌మార్క్ వైద్య సంస్థగా ఎదుగుతుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a Reply