Indrakeeladri | ఆహ్లాదం…ఆక‌ర్ష‌ణీయం..!

Indrakeeladri | ఆహ్లాదం…ఆక‌ర్ష‌ణీయం..!

  • భ‌క్తుల‌ను ఆక‌ట్టుకునేలా..
  • దుర్గ‌గుడి ఘాట్‌రోడ్డు ప్ర‌హ‌రీ..
  • దూరం నుంచి చూసినా ఆధ్యాత్మిక భావం క‌లిగేలా సొబ‌గులు..
  • ఈవో శీనానాయ‌క్ కృషితో ఇంద్ర‌కీలాద్రి సుంద‌రం…

Indrakeeladri

ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : ఆహ్లాదం.. ఆనందం.. ఆకర్షణీయం.. ఆధ్యాత్మికం.. ఇలా అన్ని కళ్ళకు సాక్షాత్కారం… మనసుకు ప్రశాంతత కలిగించేలా ఇంద్రకీలాద్రి సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. విజయవాడలోనే ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం సరికొత్త సొగసులను చుట్టుకుంది.

ఇంద్రకీలాద్రిపైన కొలువై ఉన్న కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించే దిశగా ఆలయ కార్యనిర్వహణాధికారి సీనా నాయక్ గత 15 రోజులుగా చేపట్టిన ప్రత్యేక పారిశుద్ధ్య పనులు సత్ఫలితాలనిస్తున్నాయి.

ముఖ్యంగా కొండపైకి వెళ్లే ఘాట్ రోడ్డు ప్రహరీ గోడ బోర్డర్ ప్రాంతాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. గత కొంతకాలంగా ఘాట్ రోడ్డు వెంబడి పిచ్చి మొక్కలు, చెత్తా-చెదారంతో నిండి అస్తవ్యస్తంగా, అనాకర్షణీయంగా ఉన్న బోర్డర్ ప్రాంతంపై ఈఓ ప్రత్యేక దృష్టి సారించారు. ఇంజనీరింగ్ విభాగం సమన్వయంతో గత రెండు వారాలుగా నిరంతరాయంగా శ్రమించి, ఆ పిచ్చి మొక్కలను తొలగించి క్లీన్ చేయించారు.

కేవలం శుభ్రం చేయడమే కాకుండా, ఇప్పుడు ఆ బోర్డర్ ప్రాంతానికి ఆకర్షణీయమైన రంగులు వేయించి, పర్యాటకులు, భక్తులు దూరంగా ఉన్నప్పుడు కూడా ఘాట్ రోడ్డు మార్గం స్పష్టంగా, అందంగా కనిపించేలా తీర్చిదిద్దారు.

ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ, అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతితో పాటు ఇంద్రకీలాద్రి పర్యావరణం కూడా ఆహ్లాదాన్ని పంచాలనే లక్ష్యంతో ఈ పనులు చేపట్టామన్నారు.

ఇంజనీరింగ్ విభాగం అధికారులు, సిబ్బంది అంకితభావంతో పనిచేసి ఘాట్ రోడ్డుకు కొత్త రూపాన్ని తీసుకువచ్చారని ఆయన అభినందించారు. ప్రస్తుతం ఇంద్రకీలాద్రి కొండ కింద నుండి చూసినా లేదా ఘాట్ రోడ్డులో ప్రయాణించినా స్వచ్ఛమైన, అందమైన బోర్డర్ భక్తులకు కనువిందు చేస్తోంది.

Leave a Reply