Temple | అమ్మ.. నీ ఆదాయం జాగ్రత్త..

Temple | అమ్మ.. నీ ఆదాయం జాగ్రత్త..

Temple, ఎన్టీఆర్ జిల్లా, ఆంధ్రప్రభ : ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గోపయ్య సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవారి ఆలయ ఆదాయం రోజురోజుకు తగ్గుతుంది. గతంలో అమ్మవారికి భక్తులు హుండీల ద్వారా సమర్పించే కానుకల ద్వారా రోజుకు లక్ష రూపాయలు వరకు ఆదాయం సమకూరేది. అంతే కాకుండా ఈ ఏడాది ఆరంభంలో రోజువారి హుండీ ఆదాయం 1,25,000 దాకా పెరిగింది. అయితే.. అనూహ్యంగా గడిచిన ఆరు నెలల కాలం నుంచి హుండీ ఆదాయం తగ్గుముఖం పడుతూ వచ్చింది. అమ్మవారి దర్శనానికి భక్తులు సంఖ్య గణనీయంగా పెరిగినా.. హుండీ ఆదాయం మాత్రం తగ్గడం పై భక్తులు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.

ఆలయంలో సీసీ కెమెరాలు ఉన్నా వాటిని పర్యవేక్షించే అధికారి లేకపోవడం, ఆలయంలోని కొంతమంది అధికారులు వారు మెచ్చిన.. నచ్చిన విధంగా పని చేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు వారికి కావలసిన చోట నియమించుకొని హుండీ ఆదాయాన్ని పక్కదారి పట్టిస్తున్నారని భక్తుల ఆరోపిస్తున్నారు. ఇప్పటికే కొంతమంది అధికారులు తమ స్వార్థం కోసం ఆలయ ఆదాయం తగ్గింది అన్న నెపంతో ఆర్ జె సి కేడర్లో ఉన్న దేవస్థానాన్ని డి సి క్యాడర్ కు డీ ప్రమోట్ చేయించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే త్వరలో ఆలయం డి సి స్థాయి నుండి ఏ సి క్యాడర్ దిగజారే అవకాశం కూడా లేకపోలేదని వారు వాపోతున్నారు.

ఇప్పటికైనా గౌరవ శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ ( తాతయ్య) ఆలయ అధికారులు, గ్రామ పెద్దలతో సమీక్ష నిర్వహించి ఆలయ ఆదాయం తగ్గటానికి కారణాలు తెలుసుకొని సంబంధిత వ్యక్తుల పై కఠినమైన చర్యలు తీసుకొని, ఆలయ అభివృద్ధికి సహకరించాలని భక్తులు కోరుకుంటున్నారు. గడిచిన ఆరు నెలల కాలంలోనే ఒక్క హుండీల ద్వారా సుమారు 40 లక్షల రూపాయల ఆలయ ఆదాయం తగ్గటం వలన అధికారుల పై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply