ఫ్రీ పోస్ట్ మెట్రిక్స్, స్కాలర్షిప్ దరఖాస్తుల సంఖ్య పెంచాలి..
పెద్దపల్లి, ఆంధ్రప్రభ : గురుకుల నిర్వహణ విధులు సమర్థవంతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష(Koya Shri Harsha) సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ రోజు పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టరేగ్‌లో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఎస్సీ సంక్షేమ శాఖ పని తీరు పై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని సంక్షేమ వసతి గృహాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, పరిసర ప్రాంతాలలో పిచ్చి మొక్కలు తొలగించాలని, సెప్టిక్ ట్యాంక్(Septic Tank)లను ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలని, పారిశుధ్య నిర్వహణ కోసం స్థానిక పంచాయతీ లేదా మున్సిపల్ అధికారుల సహకారం తీసుకోవాలన్నారు. ఎస్సీ వసతి గృహాలలో అవసరమైన మరమ్మత్తు పనులు చేపట్టాలని కలెక్టర్ తెలిపారు. వసతి గృహాల(dormitories)లో ఖాళీలు ఎక్కువగా ఉన్నాయని, విద్యార్థులను భర్తీ చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ తెలిపారు.
వసతి గృహాల్లో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులు అందరూ పబ్లిక్ పరీక్షల్లో (Public Examinations)100 శాతం ఉత్తీర్ణత సాధించేలా సంక్షేమ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. వసతి గృహాలలో చదువుతున్న విద్యార్థులు ఎవరైతే చదువులో వెనుకబడి ఉన్నారో వారిపై సంక్షేమ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, ప్రత్యేకంగా ట్యూటర్లను(Tutors) ఏర్పాటు చేసి బోధన అందించాలని కలెక్టర్ ఆదేశించారు.
ఫ్రీ పోస్ట్ మెట్రిక్స్, స్కాలర్షిప్ దరఖాస్తుల సంఖ్య పెంచాలని కలెక్టర్ సూచించారు. వసతి గృహ సంక్షేమ అధికారులు తమకు కేటాయించిన మండలాల్లోని పాఠశాలలను సందర్శించి సంబంధిత ప్రధానోపాధ్యాయులు, మండల అధికారులను సంప్రదిస్తూ విద్యార్థులంతా తప్పనిసరిగా ప్రీ పోస్టు మెట్రిక్స్ స్కాలర్షిప్ దరఖాస్తు చేసుకునే విధంగా చూడాలని అన్నారు. సంక్షేమ శాఖ అధికారులంతా సమయ పాలన పాఠశాల విధులు సక్రమంగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి ఎం.రవీందర్, సహాయ సంక్షేమ అధికారి శ్రావణ్ కుమార్, వసతి గృహ సంక్షేమ అధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

