నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు తప్పవు
సీఐ బన్సీలాల్ హెచ్చరిక
చెన్నూరు, ఆంధ్రప్రభ: వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవని చెన్నూరు టౌన్ సీఐ బన్సీలాల్ హెచ్చరించారు. ఆదివారం అర్ధరాత్రి వరకు పట్టణ పరిధిలోని జాతీయ రహదారిపై పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. వాహనదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని గుర్తించేందుకు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.
తనిఖీల్లో భాగంగా పలు వాహనాలను ఆపి తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని వాహనదారులతోపాటు నిబంధనలు ఉల్లంఘించిన వారికి చలాన్లు విధించారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ బన్సీలాల్ హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాలను నివారించడం, పట్టణంలో శాంతిభద్రతలను పరిరక్షించడమే లక్ష్యంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
