నందికొట్కూరు కానిస్టేబుల్ కు ఉత్తమ పురస్కారం..
నందికొట్కూరు, ఆంధ్రప్రభ : 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా పోలీస్ శాఖలో అంకితభావంతో విధులు నిర్వహిస్తున్న నందికొట్కూరు అర్బన్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ సుబ్బరాయుడు ఉత్తమ కానిస్టేబుల్ పురస్కారానికి ఎంపికయ్యారు. పగిడ్యాల మండలం పాలమర్రి గ్రామానికి చెందిన సుబ్బరాయుడు ప్రస్తుతం నందికొట్కూరు అర్బన్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు.
శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణలో చూపిన చొరవతో పాటు ప్రజల భద్రతే ధ్యేయంగా పనిచేస్తున్న తీరును గుర్తించిన జిల్లా యంత్రాంగం ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేసింది. జిల్లా కేంద్రంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్, జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి చేతుల మీదుగా సుబ్బరాయుడు ప్రశంసా పత్రం అందుకున్నారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సునీల్ షియోరాన్, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ప్రజాసేవలో అంకితభావంతో పనిచేసే సిబ్బంది పోలీస్ శాఖకే గర్వకారణమని మంత్రి ఫరూక్ అభినందించారు. అవార్డు తన బాధ్యతను మరింత పెంచిందని, ప్రజాసేవకు మరింత అంకితమవుతానని కానిస్టేబుల్ సుబ్బరాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ఆత్మకూర్ డీఎస్పీ రామాంజి నాయక్, సీఐ అశోక్ కుమార్, ఎస్సై చంద్రశేఖర్, పోలీస్ సిబ్బంది సుబ్బరాయుడును అభినందించారు.
