దేశం కోసం ప్రాణ త్యాగాలకు సైతం ముస్లింలు సిద్ధం
- ఉర్దూ అకాడమి చైర్మన్ ఫరూఖ్ షుబ్లీ
- హర్ ఘర్ తిరంగా స్ఫూర్తితో జాతీయ జెండాలు పంపిణీ
ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ: దేశం, ధర్మం కోసం ప్రాణ త్యాగాలకు సైతం ముస్లింలు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఉర్దూ అకాడమి చైర్మన్ ఫరూఖ్ షుబ్లీ స్పష్టం చేశారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కొండపల్లి పట్టణంలోని హజరత్ సయ్యద్ షా బుఖారి బాబా దర్గా ఆవరణలో మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో శుక్రవారం జాతీయ జెండాలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఫరూఖ్ షుబ్లీ మాట్లాడుతూ.. దేశ రక్షణ, సమగ్రతకు ముస్లిం సమాజం కట్టుబడి ఉందన్నారు. భారతీయ ముస్లింగా ఈ దేశానికి చిన్న ఆపద వచ్చినా ముందు వరుసలో నిలిచి పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. దేశం కోసం – ధర్మం కోసం లక్ష్యంతో సమితి ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 65 నియోజకవర్గాల్లో లక్ష ఇళ్లకు జాతీయ జెండాలు పంపిణీ చేసే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. అందులో భాగంగా మైలవరం నియోజకవర్గంలో ఐదు వేల ఇళ్లకు జాతీయ జెండాలు అందజేస్తున్నట్లు చెప్పారు.
సూఫీ మత గురువు అల్తాఫ్ బాబా మాట్లాడుతూ 450 సంవత్సరాల చరిత్ర కలిగిన షా బుఖారి బాబా దర్గా ఆవరణలో హర్ ఘర్ తిరంగా స్ఫూర్తితో ఈ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రతిఒక్కరూ బాధ్యతగా తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు మైనార్టీ నేతలు, స్థానికులు పాల్గొన్నారు.

