ఢిల్లీలో హై అలర్ట్…

హైకోర్టు, విమానాశ్రయానికి బెదిరింపు
ఈ-మెయిల్స్.. అప్రమత్తమైన భద్రతా బలగాలు


ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముందు రోజు దేశ రాజధాని ఢిల్లీలో బాంబు బెదిరింపు ఈ-మెయిల్స్ కలకలం రేపాయి. ఢిల్లీ హైకోర్టు, ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపులతో కూడిన ఈ-మెయిళ్లు రావడంతో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి.

బెదిరింపు సమాచారంతో వెంటనే రంగంలోకి దిగిన భద్రతా సిబ్బంది హైకోర్టు ఆవరణ, విమానాశ్రయ ప్రాంగణాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద వస్తువుల కోసం బాంబ్‌ స్క్వాడ్‌లు, ప్రత్యేక బృందాలు క్షుణ్ణంగా పరిశీలనలు నిర్వహించాయి.

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఇప్పటికే ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. తాజా బెదిరింపుల నేపథ్యంలో ప్రభుత్వ భవనాలు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, రద్దీ ప్రాంతాల వద్ద నిఘాను మరింత పెంచారు. ప్రయాణికులు, సందర్శకుల రాకపోకలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ అన్ని ప్రవేశ, నిష్క్రమణ మార్గాల్లో తనిఖీలను ముమ్మరం చేసినట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.