Supreme Court | అసైన్డ్ భూముల కేసులో…

సీఐడీ కేసు కొట్టివేత..
హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు


Supreme Court | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. అమరావతి రాజధాని కోసం అసైన్డ్ భూముల సేకరణ వ్యవహారంలో ఆయనపై నమోదైన కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఏకీభవించిన సుప్రీం ధర్మాసనం పిటిషన్‌ను కొట్టివేసింది.

2014–19 మధ్య చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమరావతి రాజధాని నిర్మాణం కోసం ల్యాండ్ పూలింగ్ విధానంలో భూముల సేకరణ చేపట్టారు. ఈ ప్రక్రియలో అసైన్డ్ భూముల విషయంలో అవకతవకలు జరిగాయంటూ అప్పటి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ కేసులో చంద్రబాబుతో పాటు అప్పటి మంత్రి నారాయణపై కూడా పలు సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో ఎంఎస్ నంబర్‌ 41 నిబంధనలకు విరుద్ధంగా ఉందని, కొందరికి ప్రయోజనం చేకూర్చేలా ఉత్తర్వులు ఇచ్చారని సీఐడీ ఆరోపించింది.

అయితే ఈ కేసులో సరైన ఆధారాలు లేవని పేర్కొంటూ ఇటీవల హైకోర్టు కేసును కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ పిటిషనర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం హైకోర్టు నిర్ణయాన్ని సమర్థించింది.

దీంతో అసైన్డ్ భూముల వ్యవహారంలో చంద్రబాబుపై నమోదైన కేసుకు ముగింపు పలికినట్లైంది. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నమోదైన ఈ కేసు నుంచి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకు ఉపశమనం లభించింది.