గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక తీజ్..
- ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
కోనరావుపేట, ఆంధ్రప్రభ : గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక తీజ్ పండగ అని ప్రభుత్వ, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం జై సేవాలాల్ భూక్యా రెడ్డి తండాలో తీజ్ పండుగ వేడుకల్లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తీజ్ పండుగ బంజారా గిరిజన సమాజ గొప్ప సంసృ్కతి, సంప్రదాయాలు, ఆచారాలను ప్రతిబింబించే ముఖ్యమైన పండుగ అని అన్నారు. బంజారా, గిరిజన యువతులు, పిల్లలు ఎంతో భక్తిశ్రద్ధలతో తీజ్ పండుగను జరుపుకోవడం అభినందనీయమని, వారికి మంచి భవిష్యత్ ఉండాలని, వారి కలలు నెరవేరాలని ఆయన దేవుణ్ణి కోరుకుంటున్నానన్నారు.
బంజారా సంస్కృ్కతి, కళలు, సంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి గిరిజన బిడ్డపై ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. తీజ్ వేడుకల్లో భాగంగా వారు వరి ధాన్యం విత్తనాలు, గోధుమ విత్తనాలకు నారు పోసి బతుకమ్మలు భక్తి శ్రద్దలతో మహిళలు, యువతులు, పిల్లలు తయారు చేస్తారు. చివరి పండుగ నాడు సంప్రదాయ బంజారా దుస్తులు ధరించి తీజ్ పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ సందడి చేస్తూ నిమజ్జనం చేయడం సంతోషకరమన్నారు. ఈకార్యక్రమంలో సర్పంచ్ బానోత్ నరేష్ నాయక్, బండ నర్సయ్య, గుడి చైర్మన్ రాజు నాయక్, లకవత్ రాజు, అవినాష్, మహిళలు, యువతులు పాల్గొన్నారు.
