గంటల వ్యవధిలో బాలుడి ఆచూకీ లభ్యం
జిల్లా ఎస్పీ ఆదేశాలతో రాత్రంతా సెర్చ్ ఆపరేషన్.. తుప్పల్లో బాలుడి ఆచూకీ
రణస్థలం, ఆంధ్రప్రభ: శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం రావాడ గ్రామంలో తోటలో తప్పిపోయిన రెండేళ్ల నాలుగు నెలల బాలుడు గుండు మోహిత్‌ను పోలీసులు గంటల వ్యవధిలోనే సురక్షితంగా గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర్‌రెడ్డి ఆదేశాలతో చేపట్టిన ప్రత్యేక గాలింపు చర్యలు ఫలించడంతో కథ సుఖాంతమైంది. గురువారం రాత్రి సుమారు 10.30 గంటల సమయంలో తమ కుమారుడు కనిపించడం లేదని తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన ఎస్పీ చిన్నారిని సురక్షితంగా గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించేలా చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు.
జేఆర్‌పురం సీఐ ఎం. అవతారం ఆధ్వర్యంలో ప్రత్యేక సెర్చ్ ఆపరేషన్ చేపట్టిన పోలీసులు చిన్నారి తల్లి, నానమ్మ నుంచి వివరాలు సేకరించారు. బాలుడు చివరిసారిగా ఎక్కడ కనిపించాడు, ఏ దిశగా వెళ్లి ఉండొచ్చనే అంశాలపై ఆరా తీశారు. నైట్ విజన్ డ్రోన్లు, డాగ్ స్క్వాడ్, టాస్క్‌ఫోర్స్, క్లూస్ టీమ్‌తో పాటు 15 ప్రత్యేక పోలీసు బృందాలు రాత్రంతా తోటలు, పొదలు, గ్రామ శివారు ప్రాంతాలు, నిర్మానుష్య ప్రదేశాల్లో విస్తృతంగా గాలించాయి. ఈ క్రమంలో తోట పరిసర ప్రాంతంలోని తుప్పల్లో ఉన్న చిన్నారిని గుర్తించి సురక్షితంగా రక్షించారు. శుక్రవారం ఉదయం కుటుంబ సభ్యులు, గ్రామస్తుల సమక్షంలో బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. తమ బిడ్డను క్షేమంగా తిరిగి తీసుకొచ్చిన పోలీసులకు తల్లిదండ్రులు, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. చిన్నారుల భద్రత విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ఎస్పీ సూచించారు.
