నాగార్జున సాగర్ ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలి..

  • పోతిరెడ్డి ప్రాజెక్ట్ ద్వారా ఆంధ్రాకు రోజుకి 30 వేల క్యూసెక్కుల నీటి దోపిడీ
  • చోద్యం చూస్తున్న తెలంగాణ ప్రభుత్వం
  • మాజీ జడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి

హుజూర్‌నగర్, (ఆంధ్రప్రభ) ; నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ పరిధిలో ఎడమకాలువకు సాగు తాగు నీటి అవసరాలకై తక్షణమే నీటిని విడుదల చేయాలని హుజూర్‌నగర్ మాజీ జడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి అన్నారు. హుజూర్‌నగర్ నియోజకవర్గ కేంద్రంలో శుక్రవారం జరిగిన బిఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసి తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలని శ్రీశైలం ప్రాజెక్టులో నీటి లభ్యత ఉన్నప్పటికీ పోతిరెడ్డిపాడు ద్వారా రోజుకి 30 వేల క్యూసెకుల నీటిని ఆంధ్రప్రదేశ్‌కు తరలించుకుపోతుంటే తెలంగాణ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.

తెలంగాణ రైతుల ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, కానీ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు. పోతిరెడ్డి పాడు ద్వారా నీటి తరలింపుపై తెలంగాణ మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టమైన వైఖరి ప్రకటించాలని డిమాండ్ చేశారు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణ హక్కులను కాపాడటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కృష్ణా రివర్ బోర్డు అనుమతులు లేకుండా ఆంధ్రప్రదేశ్ నీటిని వినియోగిస్తోందన్నారు. ఇదే అంశాన్ని బీఆర్‌ఎస్ మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు.

కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు. ప్రస్తుతం రైతులు సాగునీటి కోసం ఎదురుచూస్తున్నారని, ప్రాజెక్టుల్లో నీటి నిల్వలను సక్రమంగా వినియోగించకపోతే భవిష్యత్‌లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని అన్నారు. రైతుల పంటలు ఎండిపోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నీటి వినియోగంపై ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని, తెలంగాణకు రావాల్సిన కృష్ణా జలాలపై రాజీ పడవద్దని సూచించారు.

రైతాంగ ప్రయోజనాలను దెబ్బతీసే నిర్ణయాలను బీఆర్‌ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని స్పష్టం చేశారు. తెలంగాణ రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని, ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే రైతులు, బీఆర్‌ఎస్ శ్రేణులతో కలిసి రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు డా.కేఎల్ఎన్ రెడ్డి, బెల్లంకొండ అమర్, కోలపూడి చంటి నగేష్ రాథోడ్ పచ్చిపాల ఉపేందర్ భాస్కరరెడ్డి, ధనమూర్తి లింగరాజు ములకలపల్లి రాంబాబు, దుగ్గి నరసింహారావు, రామిశెట్టి రాము తదితరులు పాల్గొన్నారు.