ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
నిజమైన కార్యకర్తలకు న్యాయం జరగాలి..
పార్టీ బలోపేతం కోసమే ఈ వ్యాఖ్యలు చేశానన్న నేత
హైదరాబాద్, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పార్టీలో బయటి వ్యక్తుల ఆధిపత్యం పెరుగుతోందని ఆ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన కొందరు నేతలు కాంగ్రెస్ కార్యకర్తలను అణచివేయడం సరికాదని అన్నారు. నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు తగిన గౌరవం, ప్రాధాన్యం దక్కాలని అభిప్రాయపడ్డారు.
‘నేను కాంగ్రెస్‌లోనే ఉన్నా’
తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నానని, రాహుల్ గాంధీ నాయకత్వంలోనే పనిచేస్తానని రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీని కానీ, ప్రభుత్వాన్ని కానీ విమర్శించడం తన ఉద్దేశం కాదని పేర్కొన్నారు. పార్టీ బలహీనపడకూడదనే ఉద్దేశంతోనే కొన్ని అంశాలను ప్రస్తావిస్తున్నానని తెలిపారు.
ఉద్యమకారులకు, పార్టీ నేతలకు గుర్తింపు ఇవ్వాలి
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులు, కాంగ్రెస్ నాయకులకు తగిన గౌరవం దక్కాలని రాజగోపాల్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడుతూ ప్రజాపాలన కొనసాగాలని సూచించారు.
‘పేదల కోసం పనిచేయాలి’
ప్రభుత్వ విధానాలు పేద ప్రజల సంక్షేమం దిశగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం కాకుండా సామాన్య ప్రజల కోసం పాలన సాగాలని అన్నారు.
‘సీమాంధ్ర పాలకుల మీడియా ప్రభావం ఉండొద్దు’
తెలంగాణ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకునే విషయంలో సీమాంధ్ర పాలకుల మీడియా చెప్పుచేతల్లో నడవకూడదని రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ ఆత్మగౌరవం, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగాలని అన్నారు.
రాహుల్ నాయకత్వంలోనే అభివృద్ధి
రాష్ట్ర అభివృద్ధి రాహుల్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. పార్టీని ప్రజల్లో మరింత బలోపేతం చేయాలంటే క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.
పార్టీ కోసం చేసిన వ్యాఖ్యలు
కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో బలహీనపడకూడదనే ఉద్దేశంతోనే ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్లు రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు పార్టీ పాత కార్యకర్తలను విస్మరించకుండా అందరినీ కలుపుకొని ముందుకు వెళ్లాలని సూచించారు.
