ప్రపంచ స్థాయిలో మరిన్ని పతకాలు సాధించాలి..

  • రాష్ట్ర పీసీసీ ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి..

బిక్కనూర్, ఆంధ్రప్రభ : కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండల కేంద్రానికి చెందిన క్రీడాకారిణి రిశ్విత ప్రపంచ స్థాయిలో మరిన్ని పతకాలు సాధించాలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్‌రెడ్డి ఆకాంక్షించారు.

శుక్రవారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రిశ్వితను ఘనంగా సత్కరించారు. ఇటీవల ఇటలీలో జరిగిన ప్రపంచ సెయిలింగ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్న ఆమె రజత పతకం సాధించిన సందర్భంగా ఈ అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమెను శాలువాలతో సత్కరించి అభినందించారు.

అనంతరం ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. క్రీడాకారులు తమ ప్రతిభను మరింత మెరుగుపరుచుకుని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని సూచించారు. రిశ్వితకు ప్రభుత్వ పరంగా అన్ని విధాలా సహాయం అందేలా కృషి చేస్తామని తెలిపారు.

రిశ్వితను స్ఫూర్తిగా తీసుకుని ఇతర క్రీడాకారులు కూడా క్రీడారంగంలో రాణించి సమాజంలో మంచి గుర్తింపు పొందాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి రాజబాబు గౌడ్, మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుదర్శన్, కాచాపూర్ గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నరసింగరావు తదితర నాయకులు పాల్గొన్నారు.